న్యూ ఢిల్లీ: పాఠశాల క్రీడా పోటీల నేపథ్యంలో రూపొందించిన ప్రత్యేక గీతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంబించిన ‘ఖేలో ఇండియా’ ప్రచారంలో భాగంగా ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ జరుగనున్నాయి. జనవరి15న కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆవిష్కరించిన క్రీడా గీతాన్ని గంటల వ్యవధిలోనే సుమారు 20కోట్ల మంది వీక్షించారు. అమితాబ్, సచిన్ టెండూల్కర్, పలువురు రాజకీయనేతలు సైతం ఈ పాటకు కితాబిచ్చారు. నిర్వాణ ఫిల్మ్స్ సంస్థ రూపొందించిన ఈ ప్రత్యేక గీతాన్ని ప్రముఖ సంగీతకారుడు లూయిస్ బ్యాంక్ స్వరపర్చారు.
ఏమిటీ క్రీడా గీతం? : పాఠశాల స్థాయిలో ఆటలను ప్రోత్సహించానే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ను నిర్వహించనుంది. 17 ఏళ్లలోపు బాలబాలికలకు అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, ఖొఖో, షూటింగ్, వాలీబాల్, స్విమ్మింగ్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల ద్వారా వెయ్యి మంది క్రీడాకారులను ఎంపిక చేసి వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఐదు లక్షల స్కాలర్‌షిప్‌ను కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ అందజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment