భారత్ వల్లే మళ్లీ క్రికెట్లోకి..
జొహెనెస్‌బర్గ్: జాతి వివక్ష కారణంగా దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు బహిష్కరణకు గురైన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మళ్లీ తిరిగి పునరాగమనం చేయడంలో భారత్ పాత్ర వెలకట్టలేనిదంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు సీఎస్ఏ ప్రశంసించింది. దక్షిణాఫ్రికా క్రికెట్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా భారత్ పోషించిన పాత్రను కొనియాడింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన 'జయ హో' గీతానికి వేదికపై కళాకారులు నృత్యం చేస్తున్న సమయంలో భారత దేశం వల్లే తాము మళ్లీ క్రికెట్ లో అడుగపెట్టామని, మా పట్ల విశాల హృదయంతో వ్యవహరించిన ఆ దేశానికి కృతజ్ఞతలు అంటూ సీఎస్ఏ వీడియో సందేశంలో పేర్కొంది.
జాతి వివక్ష కారణంగా 40 ఏళ్లు నిషేధం ఎదుర్కొన్న తరువాత క్లైవ్ రైస్ సారథ్యంలో దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి భారత్లో పర్యటించిన చారిత్రాత్మక ఘట్టాన్ని సీఎస్ఏ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అంతకుముందు జాతుల వారిగా క్రికెట్ సంఘాలు విడిపోయి దేశంలో ఆటపై నిషేధం పడిన తరుణంలో భారత్ చేసిన సుదీర్ఘ కృషి అమోఘమని సీఎస్ఏ క్రికెట్ సంఘం మాజీ అధ్యక్షుడు అలీ బషర్ అన్నారు. జాతి వివక్ష కారణంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లతో మాత్రమే క్రికెట్ ఆడేవాళ్లమని, ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో అందరితో ఆడే స్వతంత్రం సీఏకు లభించిదన్నారు.