
రేప్ కేసులో ఐదుగురు వాలీబాల్ ఆటగాళ్లకు జైలు
టాంపెరె: ఫిన్లాండ్కు చెందిన ఓ యువతిపై లైంగికదాడి చేసిన కేసులో క్యూబాకు చెందిన ఐదుగురు జాతీయ వాలీబాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష పడింది. మంగళవారం ఫిన్లాండ్లోని టాంపెరె కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది. నలుగురికి ఐదేళ్ల చొప్పున, మరో ఆటగాడికి మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది.
టాంపెరెలో జరిగిన వాలీబాల్ ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో క్యూబా ఆటగాళ్లు ఫిన్లాండ్ యువతిపై దారుణానికి పాల్పడ్డారు. ఓ హోటల్లో వాలీబాల్ ఆటగాళ్లు తనపై లైంగికదాడి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూలై 2న టాంపెరె పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మొదట ఎనిమిదిమంది ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నా, విచారణ అనంతరం ఈ కేసులో ప్రమేయంలేని ముగ్గురు ఆటగాళ్లను విడిచిపెట్టారు. క్యూబాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు నేరానికి పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. కాగా వీరి పేర్లు, మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.