
కేప్‌టౌన్: భారత పర్యటనకు తనను ఎంపిక చేయకపోవడం పట్ల దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ అసహనం వ్యక్తం చేశాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టెయిన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. అయితే టీమిండియాతో జరగబోయే మూడు టీ20, మూడు టెస్టుల కోసం దక్షిణాఫ్రికా జట్టును సెలక్టర్లు మంగళవారం ప్రకటించారు. అయితే టీ20 జట్టులో స్టెయిన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాయం కారణంగా ప్రపంచకప్ ఆరంభంలోనే నిష్క్రమించిన స్టెయిన్.. ప్రస్తుతం గాయం నుంచి కోలుకొని తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అయితే సెలక్షన్‌కు అందుబాటులో ఉన్నా తనను పక్కకు పెట్టారని స్టెయిన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికా జట్టును సెలక్టర్లు ప్రకటించిన వెంటనే స్టెయిన్ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు. తనను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను సెలక్టర్లు చెప్పకపోవడం నిరుత్సాహపరిచిందని స్టెయిన్ పేర్కొన్నాడు. ఇక టీ20 జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో టీమిండియా సారథి విరాట్ కోహ్లి, కోట్లాది అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. టెస్టు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ తప్పక ఆడతానని స్టెయిన్ ప్రకటించిన విషయం విదితమే. స్టెయిన్ ఇప్పటివరకు 44 టీ20 మ్యాచ్‌ల్లో 6.79 ఎకానమీతో 61 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు డుప్లెసిస్‌ను పక్కకు పెట్టి డికాక్‌ను దక్షిణాఫ్రికా సారథిగా ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment