బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేస్తూనే ఉంది. ఈ కుంభకోణానికి బాధ్యులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బెన్‌క్రాఫ్ట్ ఇప్పటికే నిషేధానికి గురయ్యారు. ఈ వివాదంతో కుంగిపోయిన ఆసీస్ జట్టుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఆస్ట్రేలియా కోచ్ డారెన్ లీమన్ కూడా జట్టుకు దూరం కాబోతున్నారు. బాల్ ట్యాంపరింగ్ స్కాంతో ప్రమేయం లేకపోయినప్పటికీ.. తాను రాజీనామా చేస్తున్నట్టు లీమన్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో నాలుగో టెస్టు ముగిసిన తర్వాత తాను కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు.
‘ఈ ప్రస్థానంలో ఎన్నిసార్లు ప్రియమైన వారికి దూరంగా ఉంటామో ఇక్కడ ఉండేవారికి తెలుసు. కుటుంబసభ్యులతో మాట్లాడిన తర్వాత నేను రాజీనామా చేయడానికి ఇదే మంచి సమయమని నిర్ణయించుకున్నా’ అంటూ కంటతడి పెడుతూ లీమన్ మీడియాతో తెలిపారు. బాల్ ట్యాంపరింగ్ విషయంలో లీమన్ ప్రమేయం లేదని, తాము బాల్ ఆకారాన్ని మార్చాలనుకున్న విషయం ఆయనకు తెలియనే తెలియదని స్టీవ్ స్మిత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మైదానంలో బాల్ ఆకారాన్ని మార్చేందుకు బెన్‌క్రాఫ్ట్ ప్రయత్నిస్తున్న సమయంలో ‘ఏం జరుగుతోంది. అసలేం జరుగుతోంది’ అంటూ సబ్‌స్టిట్యూట్ ఆటగాడు పీటర్ హ్యాంద్‌స్కంబ్‌తో లీమన్ వాకీటాకీలో పేర్కొనడంతో.. ఆయన ఈ వివాదం నుంచి బయటపడ్డారు.
‘ఆటగాళ్లతో మాట్లాడి.. వారికి వీడ్కోలు చెప్పడం చాలా కష్టమైన పని. కానీ నేను వెళ్లిపోక తప్పదు. గత కొన్నిరోజులుగా ఎన్నో పరిణామాలు.. ఎన్నో దుర్భాషలు ఎదుర్కొన్నాను. దీనికి ఎవరో ఒకరు మూల్యం చెల్లించాలి. వాళ్లు (స్టీవ్‌స్మిత్, వార్నర్, బెన్‌క్రాఫ్ట్) తప్పు చేశారు. ఆస్ట్రేలియా జట్టు మళ్లీ బలోపేతం అవుతుందని, ఈ యువ ఆటగాళ్లను ఆస్ట్రేలియా ప్రజలు మన్నిస్తారని, వారు తిరిగి జట్టులోకి వస్తారని ఆశిస్తున్నా’ అని లీమన్ మీడియాతో తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment