కూతురు చెప్పిందని.. గోల్డ్ కొట్టాడు!
పారాలింపిక్స్‌లో భారతదేశానికి రెండో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝఝారియా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తన ఆరేళ్ల కూతురితో చేసుకున్న చిన్న డీల్ వల్లే తాను తొలిసారి స్వర్ణ పతకం సాధించిన 12 ఏళ్ల తర్వాత మళ్లీ స్వర్ణం సాధించగలిగానన్నాడు. రాజస్థాన్‌లో ఝఝారియా శిక్షణకు వెళ్లేటప్పుడు అతడితో పాటు ఆరేళ్ల కూతురు జియా కూడా వెళ్లేది. ఆమె ఎల్‌కేజీ పరీక్షలలో క్లాస్ టాపర్‌గా నిలిచింది. ఆ విషయం తన తండ్రికి చెప్పింది. ''నేను క్లాసులో టాపర్‌గా వచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా టాపర్ అవ్వాలి'' అని ఆమె చెప్పిందట. ఒలింపిక్ స్టేడియంలోకి ప్రవేశించగానే తన చెవుల్లో ఆ మాటలే పదే పదే వినిపించాయని.. ఆమెను నిరుత్సాహపరచకూడదన్న ఉద్దేశంతోనే తాను పూర్తిస్థాయిలో కష్టపడి రికార్డుతో పాటు బంగారు పతకం సాధించానని ఝఝారియా అన్నాడు.
ఇప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషించేది తన కూతురే అవుతుందని, ఆమె ఎప్పుడు నిద్రలేస్తుందా.. ఎప్పుడు మాట్లాడతానా అని ఉత్సుకతతో ఉన్నానని తెలిపాడు. 2004లో ఏథెన్స్‌లో తాను నెలకొల్పిన సొంత రికార్డును అతడు రియోలో బద్దలుకొట్టిన విషయం తెలిసిందే. బంగారు పతకం సాధించిన తర్వాత దేవేంద్ర రాత్రంతా మేలుకునే ఉండి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో తెల్లవారుజామున 5 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. 'ఇక నిద్రపోవడం ఎందుకు.. ఇప్పుడు నాకు ఏమీ కాదు. నేను జాతీయ పతాకంతో సంబరాలు చేసుకుంటా' అని అన్నాడు. తనకు మద్దతిచ్చినందుకు భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.