కంగారెత్తిస్తున్న సఫారీలు!
డర్బన్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలోనూ సఫారీలు సింహనాదం చేశారు. ఆసీస్ విసిరిన 372 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.. తొలుత డీకాక్, హషీమ్ ఆమ్లాలు స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తే, ఆ తరువాత డేవిడ్ మిల్లర్ వీరవిహారం చేశాడు. మిల్లర్(118 నాటౌట్: 79 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు)తో విజృంభించి అజేయ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యేకంగా మిల్లర్ దెబ్బకు ఆసీస్ ఊచకోతకు గురై హ్యాట్రిక్ ఓటమితో సిరీస్ ను చేజార్చుకుంది.
బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికాకు డీ కాక్ (70;49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓపెనర్ హషీమ్ ఆమ్లా(45;30 బంతుల్లో 9 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ దూకుడుగా ఆడి తొలి వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే ఆమ్లా తొలి వికెట్ గా అవుటైన తరువాత డీ కాక్ మరింత రెచ్చిపోయాడు. గత మ్యాచ్ల్లో శతకంతో కదం తొక్కిన డీ కాక్.. మరోసారి ఆసీస్ బౌలింగ్ను కకావికలం చేశాడు. అతనికి జతగా డు ప్లెసిస్(33;32 బంతుల్లో 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడి ఎప్పుడూ రన్ రేట్ తగ్గకుండా ఆసీస్ పై ఒత్తిడి తెచ్చింది. అయితే డు ప్లెసిస్ అవుటైన స్వల్ప వ్యవధిలో డీకాక్, రస్కో(18) లు పెవిలియన్ చేరడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. ఆ తరుణంలో క్రీజ్ లో కి వచ్చిన మిల్లర్ ఆసీస్ పై ఎదురుదాడికి దిగాడు. బౌండరీలే లక్ష్యంగా విధ్వంసకర ఆట తీరును ప్రదర్శించాడు. ప్రత్యేకంగా ఫెహుల్వాయో(42 నాటౌట్:39 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి స్కోరు బోర్డులో వేగం పెంచాడు. వీరిద్దరూ కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లను కోల్పోయి విజయాన్ని అందుకుంది. దాంతో ఐదు వన్డేల సిరీస్ను దక్షిణాఫ్రికా 3-0 తో కైవసం చేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 371 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(117;107 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(108; 107 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో రాణించారు.