
కోల్‌కతా: ప్రస్తుతం తన దృష్టంతా కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై మాత్రమే ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ప్రపంచకప్ గురించి ఆలోచనే లేదని.. ఐపీఎల్‌లో తన జట్టుకు ఎంతవరకు ఉపయోగపడగలననేది మాత్రమే ఆలోచిస్తున్నానని పేర్కొన్నాడు. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కాలేదని.. ప్రపంచకప్‌కు సెలెక్ట్ అయ్యేది కానిది తన చేతుల్లో లేదన్నాడు. దీంతో వేరే వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం సన్‌రైజర్స్ కోసం ఎంత వరకు కష్టపడగలనో అంతవరకు కష్టపడతానన్నాడు. దాదాపు చాలా వరకు క్రికెట్ లీగ్‌లు ఆడానని.. అన్నింటిలోకెల్లా ఐపీఎల్ మాత్రమే అత్యుత్తమని పేర్కొన్నాడు.
ఇక 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో వార్నర్, స్టీవ్ స్మిత్‌లకు గతేడాది ఐపీఎల్‌లో ఆడే అవకాశాన్ని బీసీసీఐ ఇవ్వలేదు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాది నిషేధం పూర్తయింది. దీంతో ఈ ఇద్దరు ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో తమ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నెల 24న(ఆదివారం) సన్‌రైజర్స్ తన తొలి పోరులో దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment