బ్రుయిన్
కొలంబో : శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ బ్రుయిన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడినప్పటికి బ్రుయిన్ తన సాయశక్తుల పోరాడి సెంచరీ సాధించాడు. దీంతో 25 ఏళ్ల తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో శతకం బాదిన రెండో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌గా బ్రుయిన్ రికార్డు నెలకొల్పాడు. 1993లో ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఇదే శ్రీలంకపై నాలుగో ఇన్నింగ్స్‌లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే అప్పుడు మ్యాచ్ డ్రా కాగా.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఓడిపోయింది. అప్పుడు సిరీస్ దక్షిణాఫ్రికా వశం కాగా.. ఇప్పుడు శ్రీలంకకు దక్కింది.
నాలుగో ఇన్నింగ్స్ మొనగాడు..
శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్ సైతం అరుదైన ఫీట్‌ను సాధించాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో హెరాత్ 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతే కాకుండా నాలుగో ఇన్నింగ్స్‌లో ఎక్కువ సార్లు 5 కంటె ఎక్కువ వికెట్ల పడగొట్టిన బౌలర్ కూడా హెరాతే కావడం విశేషం. 40 నాలుగో ఇన్నింగ్స్‌లు ఆడిన హెరాత్ 115 వికెట్లతో ఈ జాబితాలో తొలిస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ సీఏ వాల్ష్ 39 ఇన్నింగ్స్‌లో 66 వికెట్లు.. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 60 వికెట్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక హెరాత్ నాలుగో ఇన్నింగ్స్‌లో మొత్తం 12 సార్లు 5కు పైగా వికెట్లు సాధించాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళిదరణ్, షేన్ వార్న్ ఏడు సార్లు, అశ్విన్ 6 సార్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ శ్రీలంక 199 పరుగుల తేడాతో గెలిచి రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment