డీకాక్ 'ఫాస్టెస్ట్' రికార్డు!
లండన్: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డీ కాక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో వేగవంతమైన టెస్టు హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు స్పష్టించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో డీ కాక్ దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా లార్డ్స్ టెస్టుల్లో అత్యంత వేగవంతంగా అర్థ శతకం సాధించిన రెండో ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
ఇక్కడ టెస్టు బ్యాటింగ్ ను పక్కకు పెట్టిన డీకాక్ టీ 20ని గుర్తు చేశాడు. సాధారణంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనింగ్ వచ్చే డీకాక్.. టెస్టుల్లో మాత్రం మిడిల్ ఆర్డర్ లో కానీ, చివరి వరసులో కానీ వస్తుంటాడు. ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన డీకాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే 51 పరుగుల వద్ద డీ కాక్ ఎనిమిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 361 పరుగుల వద్ద ఆలౌటైంది..