డివిలియర్స్ విధ్వంసం | De Villiers blitz downs Sunrisers | Sakshi
Sakshi News home page

డివిలియర్స్ విధ్వంసం

Published Mon, May 5 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

డివిలియర్స్ విధ్వంసం

డివిలియర్స్ విధ్వంసం

సన్‌రైజర్స్ చిత్తు   
4 వికెట్లతో బెంగళూరు గెలుపు  
వార్నర్, కరణ్ శ్రమ వృథా
 
 ఐపీఎల్-7లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన డివిలియర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మాత్రం విశ్వరూపం చూపాడు. సిక్సర్ల వర్షంతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 73 పరుగులే చేసిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ అసలు సమయంలో వీరబాదుడు బాదాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే అజేయంగా 89 పరుగులు చేసి బెంగళూరుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. చివర్లో బౌలర్లు విఫలం కావడంతో ‘సన్’కు పరాజయం తప్పలేదు.
 
 బెంగళూరు: గేల్ దుమారం లేకపోయినా... కోహ్లి వెనుదిరిగినా... యువీ మెరుపులు మెరిపించకపోయినా...ఏబీ డివిలియర్స్ (41 బంతుల్లో 89 నాటౌట్; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు జట్టును గట్టెక్కించాడు. 95 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకున్నా... లోయర్ ఆర్డర్ సహకారంతో లక్ష్యాన్ని ఛేదించాడు. ఫలితంగా  ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించింది.
 
 
 చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. వార్నర్ (49 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో చెలరేగగా, ధావన్ (36 బంతుల్లో 37; 4 ఫోర్లు) రాణించాడు. బెంగళూరు 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. డివిలియర్స్‌తో పాటు గేల్ (19 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు.  డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 వార్నర్ దూకుడు
 ధావన్ నెమ్మదిగా ఆడినా... రెండో ఓవర్‌లో సిక్సర్, ఫోర్‌తో విరుచుకుపడ్డ ఫించ్ (13) తర్వాతి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. బౌండరీతో ఖాతా ప్రారంభించిన రాహుల్ (6) కూడా వెంటనే అవుట్ కావడంతో ‘సన్’ తడబడింది.
 
 వార్నర్, ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా రన్‌రేట్ మాత్రం తగ్గకుండా చూశారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.
 
 బెంగళూరు బౌలర్లు కుదురుకోవడంతో వార్నర్, ధావన్‌లు సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశారు. చివరకు ఆరోన్ ఈ జోడిని విడగొట్టాడు. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు 9 ఓవర్లలో 62 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
 
 దిండా వేసిన 18వ ఓవర్‌లో వార్నర్ రెండు సిక్సర్లు కొట్టి అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే ఐదు బంతుల వ్యవధిలో ఓజా, వార్నర్ వెనుదిరిగారు. చివరి మూడు ఓవర్లలో 31 పరుగులు రావడంతో హైదరాబాద్ పోరాడే స్కోరు చేయగలిగింది.
 
 డివిలియర్స్ సిక్సర్ల వర్షం
 ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో భువనేశ్వర్... పార్థివ్ (3), కోహ్లి (0)లను అవుట్ చేయడంతో బెంగళూరు తడబడింది. ఆరంభంలో పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గేల్ షాట్లు కొట్టేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతో పరుగుల వేగం మందగించింది.
 
 స్టెయిన్ వేసిన మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన గేల్, ఆ తర్వాత ఇషాంత్‌కు ఓ ఫోర్, రెండు సిక్సర్లు రుచి చూపించాడు.
 
 ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. స్పిన్నర్ కరణ్ శర్మ బౌలింగ్‌లో బంతిని గాల్లోకి లేపిన గేల్ బౌండరీ వద్ద స్యామీ చేతికి చిక్కాడు. దీంతో ఆర్‌సీబీ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోసో, గేల్ మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించారు.
 
 డివిలియర్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 21 పరుగులు జోడించాక రోసో (14) అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యువరాజ్ (14) నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే.. డివిలియర్స్ మాత్రం వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 30 పరుగుల వద్ద క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు.
 
 యువరాజ్ అవుటయ్యాక డివిలియర్స్ షో మొదలైంది. బౌలర్ ఎవరైనా సిక్సర్ల వర్షం కురిపించాడు. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోతున్నా... ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా అనుకున్న లక్ష్యాన్ని అలవోకగా ఛేదించాడు. స్టార్క్‌తో కలిసి ఆరో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు.
 
 స్యామీ ఓవర్లో 19, స్టెయిన్ ఓవర్లో 24 పరుగులు రావడంతో బెంగళూరు విజయం సులువైంది.
 స్కోరు వివరాలు
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: ఫించ్ (సి) పార్థివ్ (బి) స్టార్క్ 13; ధావన్ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 37; రాహుల్ (సి) గేల్ (బి) దిండా 6; వార్నర్ (బి) స్టార్క్ 61; స్యామీ (సి) స్టార్క్ (బి) హర్షల్ పటేల్ 8; ఓజా (సి) స్టార్క్ (బి) ఆరోన్ 15; ఇర్ఫాన్ నాటౌట్ 4; కరణ్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 155.
 
 వికెట్ల పతనం: 1-20; 2-29; 3-91; 4-115; 5-149; 6-150
 బౌలింగ్: స్టార్క్ 4-0-21-2; దిండా 4-0-39-1; ఆరోన్ 4-0-33-2; హర్షల్ పటేల్ 4-0-29-1; చాహల్ 4-0-30-0.
 
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) స్యామీ (బి) కరణ్ శర్మ 27; పార్థివ్ (బి) భువనేశ్వర్ 3; కోహ్లి (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; రోసోవ్ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ శర్మ 14; డివిలియర్స్ నాటౌట్ 89; యువరాజ్ (సి) (సబ్) హెన్రిక్స్ (బి) కరణ్ శర్మ 14; స్టార్క్ రనౌట్ 5; హర్షల్ పటేల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లకు) 158.
 వికెట్ల పతనం: 1-5; 2-6; 3-38; 4-59; 5-95; 6-152.
 
 బౌలింగ్: స్టెయిన్ 4-0-39-0; భువనేశ్వర్ 4-0-16-2; ఇషాంత్ 3-0-35-0; కరణ్ శర్మ 4-0-17-3; ఇర్ఫాన్ 2.5-0-25-0; స్యామీ 2-0-25-0.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement