ముగురుజా నిష్క్రమించె... | Defending champion Muguruza out of Wimbledon as seeds scatter | Sakshi
Sakshi News home page

ముగురుజా నిష్క్రమించె...

Published Sat, Jul 7 2018 2:04 AM | Last Updated on Sat, Jul 7 2018 2:04 AM

Defending champion Muguruza out of Wimbledon as seeds scatter - Sakshi

లండన్‌: టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో సీడెడ్‌ క్రీడాకారిణుల నిష్క్రమణ పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే రెండో సీడ్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌), నాలుగో సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఆరో సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌), ఎనిమిదో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) ఇంటిముఖం పట్టగా... ఈ ఐదుగురి సరసన మూడో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌), తొమ్మిదో సీడ్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) చేరడం గమనార్హం.  

భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముగురుజా 7–5, 2–6, 1–6తో ప్రపంచ 47వ ర్యాంకర్‌ అలీసన్‌ వాన్‌ ఉత్వానక్‌ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. గంటా 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేసిన ఉత్వానక్‌ తన కెరీర్‌లో తొలిసారి టాప్‌–10లోపు క్రీడాకారిణిపై గెలిచింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 7–5, 7–6 (7/2)తో మ్లాడెనోవిచ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆమె సోదరి వీనస్‌ 2–6, 7–6 (7/5), 6–8తో కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడిపోయింది. మరో మూడో రౌండ్‌ మ్యాచ్‌లో ఎవగెనియా రొడినా (రష్యా) 7–5, 5–7, 6–4తో పదో సీడ్‌ మాడిసన్‌ కీస్‌పై సంచలన విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌ విభాగం మూడో రౌండ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 6–3, 7–5, 6–2తో స్ట్రఫ్‌ (జర్మనీ)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. అన్‌సీడెడ్‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 5–7, 6–4, 6–4, 6–2తో 11వ సీడ్‌ సామ్‌ క్వెరీ (అమెరికా)పై గెలుపొందాడు.   

బోపన్న జంట ఓటమి 
పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–రోజర్‌ వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట పరాజయం పాలైంది. ఫ్రెడరిక్‌ నీల్సన్‌ (డెన్మార్క్‌)–సాలిస్‌బరీ (బ్రిటన్‌)తో జరిగిన మ్యాచ్‌లో బోపన్న ద్వయం 4–6, 6–7 (4/7)తో తొలి రెండు సెట్‌లను కోల్పోయి... మూడో సెట్‌లో 1–2తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement