సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి రోజు ఆటలో ప్రత్యర్థిని నియంత్రించలేక బౌలర్లు విఫలమవ్వగా... రెండో రోజు ఆదివారం బ్యాట్స్‌మెన్ సమష్టిగా చేతులెత్తేశారు. దీంతో స్థానిక రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఢిల్లీతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆదివారం ఆటముగిసే సరికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 8 వికెట్లకు 194 పరుగులు చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ ఇంకా 221 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (159 బంతుల్లో 63; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. తన్మయ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. జట్టు స్కోరు 37 పరుగుల వద్ద ఓపెనర్ అక్షత్ రెడ్డి (20) ఉన్ముక్త్ చంద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో 10 పరుగుల వ్యవధిలో కుల్వంత్ బౌలింగ్‌లో కె. రోహిత్ రాయుడు (6) ఎల్బీగా అవుటయ్యాడు. ఈ దశలో తన్మయ్, బి. సందీప్ (26) జోడి కుదురుగా ఆడి ఇన్నింగ్స్‌ను నిర్మించింది.
ఈ జంట 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం కుల్వంత్ బౌలింగ్‌లోనే సందీప్ మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ కొల్లా సుమంత్ (15), టి. రవితేజ (4), ఆకాశ్ భండారి (5), మెహదీ హసన్ (14) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం సాకేత్ (21 బ్యాటింగ్), ప్రజ్ఞాన్ ఓజా (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో కుల్వంత్, వికాస్ మిశ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 336/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఢిల్లీ 107.4 ఓవర్లలో 415 పరుగులకు ఆలౌటైంది. మనన్ మిశ్రా (36), టోకాస్ (28 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో రవికిరణ్, మెహదీ హసన్ చెరో 3 వికెట్లు దక్కించుకున్నారు.
స్కోరు వివరాలు
ఢిల్లీ తొలి ఇన్నింగ్స్: 415, హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ అగర్వాల్ ఎల్బీ (బి) వికాస్ మిశ్రా 63; అక్షత్ రెడ్డి (సి) ఉన్ముక్త్ చంద్ (బి) కుల్వంత్ 20; కె. రోహిత్ రాయుడు ఎల్బీ (బి) కుల్వంత్ 6; బి. సందీప్ ఎల్బీ (బి) కుల్వంత్ 26; సుమంత్ (సి) ఆకాశ్ (బి) టోకాస్ 15; టి. రవితేజ (సి) కునాల్ (బి) వికాస్ 4; ఆకాశ్ భండారి ఎల్బీ (బి) వికాస్ 5; మెహదీ హసన్ (సి) వికాస్ (బి) ఆకాశ్ 14; సాకేత్ బ్యాటింగ్ 21; ప్రజ్ఞాన్ ఓజా బ్యాటింగ్ 6; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (65 ఓవర్లలో 8 వికెట్లకు) 194.
వికెట్ల పతనం: 1–37, 2–47, 3–107, 4–135, 5–146, 6– 147, 7–160, 8–170.
బౌలింగ్: టోకాస్ 14–3–38–1, అకాశ్ 12–2–31–1, కుల్వంత్ 13–0–40–3, లలిత్ యాదవ్ 8–0–27–0, మనన్ శర్మ 8–3–11–0, వికాస్ మిశ్రా 10–2–36–3.
Comments
Please login to add a commentAdd a comment