
దుమ్మురేపిన డికాక్, ఢిల్లీ సంచలన విజయం
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)9లో ఢిల్లీ డేర్ డెవిల్స్ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం రాత్రి ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ గెలుపొందింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్బుత సెంచరీ (108; 51 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు)కి తోడు కరుణ్ నాయర్ (54 నాటౌట్; 42 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్) స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించడంతో మరో 5 బంతులుండానే మ్యాచ్ ను ముగించింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓ దశలో 220 పరుగులు చేసేలా కనిపించినా చివర్లో వికెట్లు కోల్పోవడంతో రెండొందల స్కోరు కూడా నమోదు కాలేదు. మూడు మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ రెండు విజయాలు సాధించింది. బెంగళూరు బౌలర్లలో షేన్ వాట్సన్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. వాట్సన్ రెండు వికెట్లు పడగొట్టగా, అరవింద్ ఒక్క వికెట్ తీశాడు.
బెంగళూరు ఇన్నింగ్స్:
ఐపీఎల్-9లో భాగంగా ఆదివారం ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ (79;48 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. మరోవైపు ఏబీ డివిలియర్స్(55;33 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో రాయల్ చాలెంజర్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఏబీ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీని నమోదు చేసి ఢిల్లీ బౌలర్లు గుండెల్లో దడ పుట్టించాడు. ఈ క్రమంలోనే బెంగళూరు 10.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు సాధించింది. అయితే హాఫ్ సెంచరీకి మరో ఐదు పరుగులు మాత్రమే జోడించిన అనంతరం బ్రాత్ వైట్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ చేరాడు.
ఆ తరువాత షేన్ వాట్సన్(33;19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఒకానొక దశలో బెంగళూరు 200 పైగా స్కోరు నమోదు చేస్తుందని భావించినా.. వాట్సన్, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులకు మాత్రమే చేయకల్గింది.ఢిల్లీ బౌలర్లో మహ్మద్ షమీ రెండు వికెట్లు సాధించగా, జహీర్ ఖాన్, బ్రాత్ వైట్ లకు తలో వికెట్ దక్కింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన గత మ్యాచ్లో విరాట్(75;51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి బెంగళూరు విజయలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.