డేర్ డెవిల్స్ కు చావో రేవో!
రాయ్ పూర్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్ లో లీగ్ మ్యాచ్ లు క్లైమాక్స్ దశకు వచ్చేశాయి. ఈ టోర్నీలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ , ఢిల్లీ డేర్ డెవిల్స్ లు ప్లే ఆఫ్ రేసులో నిలవడంతో ఇక నుంచి ఆయా జట్ల మధ్య జరిగే ప్రతీ మ్యాచ్ కీలకం కానుంది. ఈ జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ దాదాపు ప్లే ఆఫ్ అవకాశాలను ఖాయం చేసుకోగా, మిగతా ఐదు జట్లు తుదికంటూ పోరాడితేగానీ వారి ప్లే ఆఫ్ అవకాశాలపై అంచనాకు రావడం కష్టం.
నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశం ఉండటంతో ఏ జట్టు ముందంజ వేస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ -ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య శుక్రవారం ఇక్కడ షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మరో రసవత్తపోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆఫ్ కు సగర్వంగా అడుగుపెట్టడంతో పాటు టాప్-2లో కూడా స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. టోర్నీ ఆరంభంలో సంచలన విజయాలతో దూసుకుపోయిన ఢిల్లీ.. ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. ఇప్పటివరకూ 12 మ్యాచ్ లాడిన ఢిల్లీ ఆరింట మాత్రమే గెలిచి ఆరో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఢిల్లీ చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడితే మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఈ నేపథ్యంలో అటు జహీర్ ఖాన్ అండ్ గ్యాంగ్ ఏ వ్యూహాలతో సిద్ధమవుతుందో వేచి చూడకతప్పదు.