ఢిల్లీ.. ఎట్టకేలకు | Delhi Daredevils keep play-off hopes alive | Sakshi
Sakshi News home page

ఢిల్లీ.. ఎట్టకేలకు

Published Wed, May 3 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

ఢిల్లీ.. ఎట్టకేలకు

ఢిల్లీ.. ఎట్టకేలకు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం
చెలరేగిన అండర్సన్‌
యువరాజ్‌ మెరుపులు వృథా

 
వరుసగా ఐదు పరాజయాలతో అట్టడుగున నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఎట్టకేలకు అదరగొట్టింది. గత మ్యాచ్‌లో అవమానకర ఆటతీరును ప్రదర్శించిన ఈ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై మాత్రం అద్భుతంగా చెలరేగింది. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్‌ తమ వంతుగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అధిగమించగలిగింది. దీంతో తమ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది. అటు యువరాజ్‌ సింగ్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టినా బౌలర్లు తడబడడంతో సన్‌రైజర్స్‌ విజయాల జోరుకు బ్రేక్‌ పడింది.

న్యూఢిల్లీ: కరుణ్‌ నాయర్‌ (20 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన ఆరంభానికి.. కోరె అండర్సన్‌ (24 బంతుల్లో 41 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫినిషింగ్‌ టచ్‌ తోడవ్వడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు చాలా రోజుల తర్వాత ఓ చక్కటి విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ సమష్టిగా రాణించడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తమ చివరి స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకోగలిగింది. అంతకుముందు ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 185 పరుగులు చేసింది. వార్నర్‌ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌), ధావన్‌ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెన్రిక్స్‌ (18 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (20 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌), శ్రేయస్‌ అయ్యర్‌ (25 బంతుల్లో 33; 1 ఫోర్, 2 సిక్సర్లు), మోరిస్‌ (7 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడారు. 2 కీలక వికెట్లు తీసిన షమీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

యువరాజ్‌ మెరుపులు
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ మరోసారి మెరుపు ఆరంభానికి ప్రయత్నించింది. దీనికి తగ్గట్టుగానే ఓపెనర్లు వార్నర్, ధావన్‌ ఇన్నింగ్స్‌ సాగింది. మూడో ఓవర్‌లో వార్నర్‌ భారీ సిక్స్‌ బాదగా ఆ తర్వాతి ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. అయితే ఆరో ఓవర్‌లో జట్టుకు గట్టి షాక్‌ తగిలింది. షమీ వేసిన ఆ ఓవర్‌ తొలి బంతిని బౌండరీగా మలిచిన వార్నర్‌  మరుసటి బంతికి బౌల్డ్‌ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే మిశ్రా గూగ్లీకి ధావన్‌ (17 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా వెనుదిరిగాడు. విలియమ్సన్‌ (24 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్‌) పెద్దగా ఆకట్టుకోలేదు. తను క్రీజులో ఉన్నంత సేపు నిదానంగా ఆడిన యువరాజ్‌.. ఆ తర్వాత  హెన్రిక్స్‌తో కలిసి జట్టును మెరుగైన స్థితిలో నిలిపాడు. 17 ఓవర్ల దాకా నత్తనడకన సాగిన ఇన్నింగ్స్‌ ఆ తర్వాత యువీ జూలు విదల్చడంతో ఒక్కసారిగా వేగం అందుకుంది.

29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సామ్సన్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన యువీ.. రబడా వేసిన 18వ ఓవర్‌లో వరుసగా 4,6 బాదగా అటు హెన్రిక్స్‌ రెండు ఫోర్లు రాబట్టడంతో 20 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. ఇక ఆఖరి ఓవర్‌లో నాలుగు ఫోర్లతో చెలరేగడంతో జట్టు భారీ స్కోరును అందుకుంది. చివరి మూడు ఓవర్లలో 51 పరుగులు రాగా వీరిద్దరి భాగస్వామ్యంలో నాలుగో వికెట్‌కు అజేయంగా 50 బంతుల్లోనే 93 పరుగులు చేరాయి.

సమష్టిగా రాణింపు
భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు సంజూ సామ్సన్‌ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కరుణ్‌ నాయర్‌ మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో చెలరేగడంతో నాలుగు ఓవర్లలో జట్టు 40 పరుగులు చేసింది. ఐదో ఓవర్‌లో సామ్సన్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో ఈ జోరుకు బ్రేక్‌ పడింది. అటు నాయర్‌ మాత్రం దూకుడును కనబరుస్తూ ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయినా తొమ్మిదో ఓవర్‌లో కౌల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుటయ్యాడు. అటు వరుస బౌండరీలతో చెలరేగుతున్న రిషభ్‌ పంత్‌ను సిరాజ్‌ అద్భుత యార్కర్‌తో బౌల్డ్‌ చేశాడు.

యువరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన శ్రేయస్‌ను భువనేశ్వర్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది. అప్పటికి 24 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉండగా అండర్సన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో లక్ష్యం సులువైంది. తనకు తోడు క్రిస్‌ మోరిస్‌ జత కలవడంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నెగ్గింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement