ద్రవిడ్ స్థానంలో గిలెస్పీ?
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత అండర్-19 క్రికెట్ జట్టుతో పాటు భారత-ఎ జట్టుకు దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ద్రవిడ్ ను మరో రెండేళ్ల పాటు కోచ్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో మాదిరి కాకుండా పూర్తిస్థాయి కోచింగ్ బాధ్యతలను ద్రవిడ్ కు అప్పగించారు. దాంతో ఇక ఏ లీగ్ కు ద్రవిడ్ కోచ్ గా వ్యవహరించకూడదు. ఆ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేశాడు.
ఈ క్రమంలోనే వచ్చే ఐపీఎల్ సీజన్ లో ద్రవిడ్ స్థానాన్ని సరైన వ్యక్తితో భర్తీ చేయాలనే యోచనలో ఉంది డేర్ డెవిల్స్ యాజమాన్యం. దానిలో భాగంగా జాసన్ గిలెస్పీన్ని ఢిల్లీ యాజమాన్యం ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన గిలెస్పీ.. బిగ్బాష్ లీగ్ లో అడిలైడ్ స్ట్రైకర్స్ కు చీఫ్ కోచ్ గా ఉన్నాడు. మరొకవైపు ఇంగ్లిష్ కౌంటీ యార్క్షైర్ గిలెస్పీని మరోసారి కోచ్ గా తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. అతని పర్యవేక్షణలోని ఆ జట్టు రెండుసార్టు కౌంటీ చాంపియన్షిప్ ను గెలిచింది. ఆసీస్ తరపున గిలెస్పీ 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు సాధించగా, వన్డేల్లో 142 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.