
అదరగొట్టిన ఢిల్లీ డేర్ డెవిల్స్
సొంతగడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ అదరగొట్టింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా శనివారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 27 పరుగుల తేడాతో నెగ్గి ప్రతీకారం తీర్చుకుంది. ఢిల్లీ విసిరిన 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా 18.3 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కోల్ కతా ఆటగాడు రాబిన్ ఉతప్ప(72; 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో ఆకట్టుకున్నా జట్టును పరాజయం నుంచి తప్పించలేకపోయాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆదిలోనే ఐయ్యర్ (0), డీ కాక్ (1), సంజూ శాంసన్(15) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కరుణ్ నాయర్ (68;50 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్(54;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాత్ వైట్(34;11బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్, ఉమేష్ యాదవ్ తలో మూడు వికెట్లు సాధించారు.
ఆ తరువాత భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ గౌతం గంభీర్(6) పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. ఆపై పీయూష్ చావ్లా(8), యూసఫ్ పఠాన్(10)లు కూడా విఫలమయ్యారు. దీంతో కోల్ కతా 58 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆ తరుణంలో ఓపెనర్ రాబిన్ ఉతప్ప కు జత కలిసిన సూర్యకుమార్ యాదవ్(21)కాస్త ఫర్వాలేదనిపించినా, సతీష్(6), ఆండ్రీ రస్సెల్(17)లు విఫలం చెందడంతో కోల్ కతా కు ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో బ్రాత్ వైట్, జహీర్ ఖాన్ లు తలో మూడు వికెట్లు తీయగా, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలకు చెరో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో కోల్ కతా 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.