న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లాల క్రికెట్ సంఘంలో (డీడీసీఏ)లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, బీసీసీఐ.. డీడీసీఏను సస్పెండ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. బీసీసీఐ శాశ్వత పరిష్కారం కొనుగొనేంత వరకు ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలను చూసుకునేందుకు క్రికెటర్లతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది.
2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. డీడీసీఏ పెద్దలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. డీడీసీఏ వ్యవహారంపై విచారణకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇదిలావుండగా, వచ్చే నెల 3 నుంచి జరగాల్సిన భారత్-దక్షిణాఫ్రికాల నాలుగో టెస్టుకు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే టెస్టు మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన అనుమతులను ఈ నెల 17 లోగా ఢిల్లీ ప్రభుత్వం నుంచి తీసుకోవాలని, లేదంటే మ్యాచ్ వేదికను పుణెకు తరలిస్తామని బీసీసీఐ.. డీడీసీఏకు గడువు విధించింది. గడువు ఈ రోజుతో ముగయనుండటంతో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
'డీడీసీఏపై వేటు వేయండి'
Published Tue, Nov 17 2015 11:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:37 PM
Advertisement