ఢిల్లీ హైకోర్టులో జ్వాలకు ఊరట, నిషేధంపై స్టే
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలన్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదనపై కోర్టు స్టే విధించింది. ఐబీఎల్లో జ్వాల అనుచితంగా ప్రవర్తించిందని, ఆమెపై వేటు వేయాలని బాయ్ క్రమశిక్షణ సంఘం ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జ్వాల కోర్టును ఆశ్రయించింది.
జ్వాల పిటిషన్ను గురువారం విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆమెను అనుమతించాలని బాయ్ను ఆదేశించింది. డెన్మార్క్ ఓపెన్లో పాల్గొనకుండా బాయ్ షాకిచ్చిన నేపథ్యంలో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంపై జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఐబీఎల్లో ఓ మ్యాచ్ సందర్భంగా జ్వాల తన జట్టు ఢిల్లీ స్మాషర్స్ షట్లర్లు ఆడకుండా అడ్డకుందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాయ్ విచారణకు ఆదేశించి చర్యలకు సిఫారసు చేసింది.