Delhi High Court stay
-
రాందేవ్ పుస్తకంపై నిషేధం ఎత్తివేతకు నో
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ జీవితంపై వచ్చిన ‘గాడ్‌మ్యాన్ టు టైకూన్’ పుస్తకం అమ్మకాలపై ఢిల్లీ హైకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రచురణ సంస్థ జగనాట్ పబ్లికేషన్స్ దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు సెప్టెంబర్‌కల్లా తుది నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. జర్నలిస్ట్ ప్రియాంక పాఠక్ రాసిన ఈ పుస్తకంలో రాందేవ్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన లాయర్లు ట్రయల్ కోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను విచారించిన కోర్టు పుస్తకం అమ్మకాలపై ఏప్రిల్ 28న నిషేధం విధించింది. కానీ జగనాట్ సంస్థ మరో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఏఎస్‌సీజే) ఒకరు ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేశారు. దీంతో రాందేవ్ న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పుస్తకం అమ్మకాలపై నిషేధం విధిస్తూ మే 10న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై జగనాట్ లాయర్లు సుప్రీంను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. -
ఢిల్లీ హైకోర్టులో జ్వాలకు ఊరట, నిషేధంపై స్టే
భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ గుత్తా జ్వాలకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. జ్వాలపై జీవితకాల నిషేధం విధించాలన్న భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదనపై కోర్టు స్టే విధించింది. ఐబీఎల్‌లో జ్వాల అనుచితంగా ప్రవర్తించిందని, ఆమెపై వేటు వేయాలని బాయ్ క్రమశిక్షణ సంఘం ఇటీవల సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. బాయ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జ్వాల కోర్టును ఆశ్రయించింది. జ్వాల పిటిషన్‌ను గురువారం విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుగా ఆమెను అనుమతించాలని బాయ్‌ను ఆదేశించింది. డెన్మార్క్ ఓపెన్‌లో పాల్గొనకుండా బాయ్ షాకిచ్చిన నేపథ్యంలో కోర్టు తీర్పు తనకు అనుకూలంగా రావడంపై జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఐబీఎల్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా జ్వాల తన జట్టు ఢిల్లీ స్మాషర్స్ షట్లర్లు ఆడకుండా అడ్డకుందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాయ్ విచారణకు ఆదేశించి చర్యలకు సిఫారసు చేసింది.