మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్ | Dharamsala to host World T20 India-Pakistan match | Sakshi
Sakshi News home page

మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్

Published Sat, Dec 12 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్

మార్చి 19న భారత్, పాక్ మ్యాచ్

ముంబై: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించారు. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా, మార్చి 19న ధర్మశాలలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మొత్తం 8 నగరాల్లో మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. మార్చి 15న భారత్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో; మార్చి 23న క్వాలిఫయర్‌తో, 27న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. పురుషుల, మహిళల విభాగంలో కలిసి మొత్తం 58 (35+23) మ్యాచ్‌లు జరుగుతాయి. మార్చి 30, 31న జరిగే సెమీఫైనల్స్‌కు న్యూఢిల్లీ, ముంబైలు ఆతిథ్యమిస్తాయి. ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరుగుతుంది.

పురుషుల నాకౌట్ మ్యాచ్‌ల తర్వాత మహిళల సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. ఫైనల్స్‌కు రిజర్వ్ డే ఉంది. పురుషుల ప్రైజ్‌మనీ 5.6 మిలియన్ డాలర్లు కాగా, మహిళలకు 4 లక్షల డాలర్లు. వన్డే వరల్డ్‌కప్‌ల మాదిరిగానే ఈ టోర్నీని కూడా భారత్ అద్భుతంగా నిర్వహిస్తుందని కార్యక్రమంలో పాల్గొన్న ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ అన్నారు. ‘ఈవెంట్‌ను ఓ మరపురాని జ్ఞాపకంగా నిర్వహించేందుకు బీసీసీఐ, ఐసీసీ కట్టుబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు దీనికి హాజరవుతారు. భారత సంస్కృతిని, ఆతిథ్యాన్ని వాళ్లకు చూపెడతాం’ అని మనోహర్ పేర్కొన్నారు. ప్రపంచకప్ నిర్వహణ కోసం తాము అన్ని విధాలుగా సిద్ధమయ్యామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్‌తోపాటు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, అజింక్య రహానే కూడా పాల్గొన్నారు.

 సూపర్-10 దశకు రెండు జట్లు
 పురుషుల ఫార్మాట్‌లో మార్చి 8 నుంచి 13 వరకు నాగ్‌పూర్, ధర్మశాలలో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 8 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, ఒమన్; గ్రూప్ ‘బి’లో జింబాబ్వే, స్కాట్లాండ్, హాంకాంగ్, అఫ్గానిస్తాన్‌లు ఉన్నాయి. ఈ గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్-10 దశకు అర్హత సాధిస్తాయి. ఇక్కడ గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’ విజేత; గ్రూప్-1లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్‌లతో పాటు క్వాలిఫయింగ్ గ్రూప్ ‘బి’ విజేత ఉంటాయి. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ పోటీలు మార్చి 15 నుంచి 28 వరకు జరుగుతాయి. మహిళల విభాగంలో గ్రూప్ ‘బి’లో భారత్‌తో పాటు ఇంగ్లండ్, వెస్టిండీస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

 ధోని నుంచి నేర్చుకుంటున్నా: కోహ్లి
 న్యూఢిల్లీ: క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించడం ఎలాగో వన్డే జట్టు కెప్టెన్ ధోనిని చూసి నేర్చుకుంటున్నానని టెస్టు సారథి విరాట్ కోహ్లి అన్నాడు. కెప్టెన్సీకి సంబంధించినంత వరకు మహీ ఒక గీతను నిర్దేశించి వెళ్లాడన్నాడు. ‘ఎంఎస్ టెస్టు, వన్డే, టి20ల్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించాడు. తర్వాతి కెప్టెన్లు సాధించడానికి ఇంకేమీ లేకుండా చేశాడు. అయితే టెస్టుల్లో మరిన్ని విజయాలు సాధించేందుకు నేను ప్రయత్నిస్తున్నా. సారథ్యం ఎలా వహించాలో అతన్ని చూసి నేర్చుకుంటున్నా. గత రెండు సిరీస్‌ల్లో ఇది బాగా మెరుగుపడింది. కష్టకాలంలో కూడా సంయమనం కోల్పోడు. దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నా.

వైస్ కెప్టెన్‌గా చాలాసార్లు గమనించా. కానీ ఇంకా నేర్చుకోవాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు. 2007 టి20 ప్రపంచకప్‌లో ధోని అమలు చేసిన వ్యూహాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నాడు.  భారత క్రికెట్‌కు ఇదో పెద్ద మైలురాయిగా నిలిచిపోయిందన్నాడు. ‘జట్టులో రోహిత్, శ్రీశాంత్‌లాంటి  కొత్త కుర్రాళ్లున్నా.. టీమ్‌ను నడిపిన తీరు అమోఘం. కొన్ని అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపెట్టాడు. ఇక అక్కడి నుంచి ప్రపంచ క్రికెట్ కెప్టెన్లలో ఓ పెద్ద సంచలనంగా మారిపోయాడు’ అని కోహ్లి ప్రశంసించాడు. టి20 ఫార్మాట్‌లో ప్రతి జట్టు ప్రమాదకరమైందేనని రహానే వ్యాఖ్యానించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement