'ధోనినే తప్పుకుంటాడు'
న్యూఢిల్లీ:వన్డే, ట్వంటీ 20 వరల్డ్ కప్ లతో పాటు చాంపియన్స్ ట్రోఫీను అందుకున్న ఏకైక భారత కెప్టెన్ ధోని. ఇదిలా ఉంచితే, 2019 వరల్డ్ కప్ కు ధోనిని జట్టులో కొనసాగిస్తారా?లేదా? అనేది భారత క్రికెట్ లో గత కొంతకాలంగా నడుస్తున్న ప్రధాన చర్చ.అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. అసలు ధోని విషయంలో ఎటువంటి చర్చ అవసరం లేదని మరోసారి స్పష్టం చేశాడు.
'వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోనికి కొనసాగుతాడా?లేదా?అనేది అతనిపై మాత్రమే ఆధారపడుతుంది. అతను అప్పటివరకూ ఆడగలను అనుకుంటే కచ్చితంగా ఆడతాడు. ఒకవేళ భారత్ కు ఇక ప్రాతినిథ్యం వహించే సత్తా తనలో లేదని భావించిన మరుక్షణమే అక్కడ ధోని ఉండడు. ఇక్కడ ధోని నిజాయితీపై నమ్మకం ఉంచండి. దీని గురించి చర్చ అనవసరం. ధోని 36వ ఒడిలో ఉన్నప్పటికీ ఇంకా పోరాడే తత్వం అతనిలో ఉంది. క్రికెట్ అనే గేమ్ గురించి ధోని ఎంత బాగా తెలుసో.. తాను ఆడాలో లేదా అనేది కూడా ధోనికి అంతే బాగా తెలుసు. క్రికెట్ కెరీర్ కు ఉద్వాసన చెప్పే సమయం వచ్చిందని భావిస్తే వెంటనే వీడ్కోలు చెబుతాడు'అని హస్సీ అభిప్రాయపడ్డాడు.