అమితాబ్, ధోనీ ఇద్దరికీ కోపం వచ్చింది! | dhoni gets anger during press meet, amitabh slams commentators | Sakshi
Sakshi News home page

అమితాబ్, ధోనీ ఇద్దరికీ కోపం వచ్చింది!

Published Thu, Mar 24 2016 8:50 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

అమితాబ్, ధోనీ ఇద్దరికీ కోపం వచ్చింది!

అమితాబ్, ధోనీ ఇద్దరికీ కోపం వచ్చింది!

ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కోపం వచ్చింది. బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్‌ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత, టీమిండియా గెలిచినా కూడా ఎందుకు వీళ్లిద్దరికీ కోపం వచ్చిందో తెలుసుకోవాలంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా వెళ్తున్న ధోనీ ప్రెస్‌మీట్ వీడియో చూడాలి, అలాగే ట్విట్టర్‌లో అమితాబ్ బచ్చన్‌ ఏమన్నారో చదవాలి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎప్పుడూ జరిగే ప్రెస్‌మీట్‌లో కెప్టెన్ ధోనీ ఒక్కడే పాల్గొన్నాడు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్నారు. ''మ్యాచ్‌కి ముందు, నెట్‌ రన్‌రేటును పెంచుకోడానికి మనం భారీగా గెలవాల్సి ఉంటుందని అందరూ అనుకున్నాం. కానీ అతి కష్టమ్మీద గెలవగలిగాం. ఇలాంటి విజయంతో మీరు ఎంతవరకు సంతృప్తి చెందుతున్నారు?'' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.

అంతే.. ఒక్కసారిగా ధోనీకి కోపం వచ్చింది. ''నాకు అర్థమైంది.. భారత్ గెలిచినందుకు మీరు సంతోషంగా లేరు. నేను చెప్పేది వినండి. మీ గొంతును, మీ ప్రశ్నను బట్టి చూస్తుంటే టీమిండియా గెలిచినందుకు మీకు ఏమాత్రం ఆనందంగా లేనట్టు నాకు స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్ విషయానికి వస్తే ఇందులో స్క్రిప్టు అంటూ ఏమీ ఉండదు. టాస్ ఓడిపోయిన తర్వాత ఆ వికెట్ మీద మేం ఎందుకు పరుగులు చేయలేకపోయామో విశ్లేషించాలి. మీరు బయట కూర్చుని కూడా ఈ విషయాలను విశ్లేషించలేకపోయినప్పుడు, ఈ ప్రశ్న అడిగి ఉండకూడదు' అని స్పందించాడు.

ఇక బాలీవుడ్ పెద్దాయన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌కు కూడా ఎక్కడలేని కోపం వచ్చింది. భారత కామెంటేటర్లు ఎప్పుడైనా కూడా అవతలి వాళ్ల కంటే మన వాళ్ల గురించి మాట్లాడాలని అమితాబ్ ట్వీట్ చేశారు. మ్యాచ్‌లో కామెంటేటర్లు బంగ్లా బ్యాట్స్‌మెన్ గురించి ఎక్కువగా ప్రస్తావించడం, చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వరుసగా రెండు వికెట్లు తీసినా కూడా దాని గురించి పెద్దగా ప్రస్తావించకపోవడంతో అమితాబ్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎప్పుడు చూసినా వాళ్లనే పొగుడుతూ ఉంటారని, అవతలి జట్టులో బ్యాట్స్‌మన్ ఔట్ అయినప్పుడు దానికి దుఃఖం వ్యక్తం చేస్తున్నారని, మన బౌలింగ్ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడరేంటని మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement