టీమిండియా మాజీ క్రికెటర్, 2007 ప్రపంచకప్ హీరో జోగీందర్ శర్మ చిక్కుల్లో పడ్డారు. హరియాణా పోలీస్ శాఖలో ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్(డీఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జోగీందర్ శర్మపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా హిసార్‌కు చెందిన పవన్ అనే వ్యక్తి జనవరి 1న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడి తల్లి.. ఆస్తి తగాదాల వల్ల తలెత్తిన సమస్య కారణంగానే తన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అందుకే ఆయన పేరు కూడా చేర్చారు!
ఇందులో భాగంగా జోగిందర్ శర్మ సహా ఆరుగురి పేర్లను తన ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. ప్రస్తుతం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న తమ ఆస్తి కేసు విషయంలో ఐదుగురు వ్యక్తులు తమపై ఒత్తిడి తీసుకువస్తున్నారని చెప్పినా.. డీఎస్పీగా ఉన్న జోగీందర్ శర్మ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తన ఫిర్యాదులో జోగీందర్ శర్మ పేరును కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో నిందితులతో పాటు జోగీందర్ శర్మపై కూడా హరియాణా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం
కాగా పవన్ బలవన్మరణం నేపథ్యంలో తమకు జరిగిన అన్యాయానికి బదులుగా ప్రభుత్వం పరిహారం చెల్లించాలని అతడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆర్థిక సాయం అందించడంతో పాటు ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ కేసు పక్కదారి పట్టకుండా లోతుగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
అతనెవరో నాకు తెలియదు
ఈ నేపథ్యంలో బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే, ఈ విషయంపై స్పందించిన జోగీందర్ శర్మ.. ‘‘నాకు అసలు ఈ కేసు గురించి తెలియదు. పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అతడిని ఒక్కసారి కూడా కలవలేదు’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండియా టుడే కథనం ప్రచురించింది.
ధోని నమ్మకం నిలబెట్టి.. ప్రపంచకప్‌ను ముద్దాడి
టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో జోగీందర్ శర్మది కీలక పాత్ర. సౌతాఫ్రికా వేదికగా దాయాది పాకిస్తాన్‌తో నువ్వా- నేనా అన్నట్లు పోటాపోటీగా సాగిన ఫైనల్లో.. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బంతిని జోగీందర్‌కు ఇచ్చాడు.
అప్పటికి పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో ఆరు పరుగులు కావాలి. అలాంటి సమయంలో జోగీందర్ తెలివిగా బౌలింగ్ చేశాడు. అతడు సంధించిన బంతిని పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో పాక్ ఓడింది.. టీమిండియా ప్రపంచకప్‌ను ముద్దాడింది.
సీఎస్‌కేకు ఆడిన జోగీందర్ శర్మ
ఇక నాటి మ్యాచ్‌లో జోగీందర్ శర్మ మొత్తంగా 3.3 ఓవర్ల బౌలింగ్‌లో 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో 2010, 2011 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి రెండు సందర్భాల్లోనూ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు.
2011 తర్వాత ఆటకు దూరమైన జోగీందర్ శర్మ క్రికెట్‌కు అందించిన సేవల నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన డీఎస్పీగా ఉన్నట్లు సమాచారం. ఇక టీమిండియా తరఫున 4 వన్డే, 4 టీ20లు ఆడిన రైటార్మ్ పేసర్ జోగీందర్ శర్మ ఆయా ఫార్మాట్లలో ఒకటి, నాలుగు వికెట్లు తీశారు.
NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
►మెయిల్: roshnihelp@gmail.com.
చదవండి: తరానికొక్క ఆటగాడు.. ముంబై అలా చేయకపోతే టీమిండియాకు నష్టం
Comments
Please login to add a commentAdd a comment