టీ20 వరల్డ్‌కప్-2007 గెలిచిన కెప్టెన్ ధోని (PC: ICC)
చెన్నై సూపర్ కింగ్స్ అంటే మహేంద్ర సింగ్ ధోని.. ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్ అంటూ ఉంటారు తలా అభిమానులు. సీఎస్‌కేతో ధోని అనుబంధం ఎలాంటిదో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ఐపీఎల్‌లో చెన్నైకి ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన ఘనత ధోని సొంతం.
క్యాష్ రిచ్ తొలి సీజన్‌లో జట్టును ఫైనల్ వరకు తీసుకువచ్చిన ధోని.. 2010, 2011, 2018, 2021, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిపాడు. అదే విధంగా.. తలా సారథ్యంలో 2012, 2013, 2015, 2019లో రన్నరప్‌గా నిలిచింది సీఎస్‌కే.
ఈ క్రమంలో ధోనితో తమ బంధాన్ని సెలబ్రేట్ చేస్తూ మా గుండెల్లో నీ స్థానం పదిలం అంటూ అభిమానాన్ని చాటుకుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ధోని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్‌లో తన ఆగమనం గురించి చెబుతూ.. ‘‘తొలుత ఐదుగురి పేర్లను మార్క్యు ప్లేయర్లు(ఐకాన్)గా ప్రకటించారు.
ఆ తర్వాత కొన్ని ఫ్రాంఛైజీలు నన్ను సంప్రదించాయి. ఐకాన్ ప్లేయర్‌గా ఉండాలని కోరాయి. అందుకు ఒక మిలియన్ డాలర్ల మేర ఆఫర్ చేశాయి.
నాకు నిర్ణయం తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. అయితే, నేను మాత్రం రిస్క్ తీసుకోవాలనే నిర్ణయించుకున్నా. 2007లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌ను నేను.
కాబట్టి నేను వేలంలోకి వెళ్తే కచ్చితంగా మిలియన్ డాలర్ కంటే ఎక్కువ మొత్తమే పలుకుతానని భావించా. అందుకే వేలంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. నిజానికి.. మార్క్యు ప్లేయర్‌ని ముందే పెట్టుకుంటే వారికి 10 -15 శాతం ఎక్కువగా చెల్లించాలి. అలాంటి ప్లేయర్‌తో పాటు ఇంకో కీలక ఆటగాడిని కొనుగోలు చేయాలంటే ఫ్రాంఛైజీల యజమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
అయినా సరే.. నేను వెనక్కి తగ్గొద్దనే నిర్ణయించుకుని వేలంలోకి వెళ్లాను. మార్క్యు ప్లేయర్ లేని జట్టు నన్ను కొనుగోలు చేస్తే గనుక నాకు ఎక్కువ మొత్తం లభిస్తుందనే ఆలోచనతో ముందడుగు వేశాను. అప్పుడు నన్ను సీఎస్‌కే 1.5 మిలియన్ డాలర్లు(సుమారు 6 కోట్ల రూపాయలు) పెట్టి కొనుక్కుంది.
ఏ రకంగా చూసినా నాకు ఇది లాభమే’’ అని ధోని చెప్పుకొచ్చాడు. అదండీ సంగతి.. సీఎస్‌కే సహా తనను ఇతర ఫ్రాంఛైజీలు సంప్రదించి ఆఫర్లు ఇచ్చినా.. తనకున్న క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ధోని వేలంలో అడుగుపెట్టాడన్న మాట.
చెన్నై కాకుండా ఇతర జట్లు తనను కొన్నా తాను ఇలాగే ఉండేవాడినని.. ఆ సమయంలో డబ్బే తనకు ముఖ్యమని చెప్పకనే చెప్పాడు 42 ఏళ్ల ధోని! కాగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్ ధోని. టీ20 వరల్డ్‌కప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, చాంపియన్స్ ట్రోఫీ-2013 అతడి ఖాతాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment