2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియా కెప్టెన్ ధోని (PC: BCCI)
MS Dhoni: మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. మొహమాటానికి తావు లేకుండా జట్టు ఎంపిక మొదలు.. మైదానంలో వ్యూహాల అమలు వరకు ఆటకు సంబంధించిన ప్రతీ విషయంలో పక్కాగా ఉండటం తనకు అలవాటు.
ఈ క్రమంలో కొన్నిసార్లు ధోని విమర్శల పాలయ్యాడు కూడా! ముఖ్యంగా ఒకప్పటి స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు ధోని అన్యాయం చేశాడంటూ.. అతడి తండ్రి యోగ్‌రాజ్ బాహాటంగానే మండిపడిన విషయం తెలిసిందే. అదే విధంగా వన్డే వరల్డ్‌కప్-2011 జట్టులో రోహిత్ శర్మను కాదని.. పీయూశ్ చావ్లా వైపే మొగ్గు చూపడం ధోనికే చెల్లింది.
అవును.. నాకు ధోనితో విభేదాలున్నాయి..
ఈ నేపథ్యంలో మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకూ ఒకప్పుడు ధోనితో విభేదాలు ఉన్నాయంటూ వార్తల్లోకెక్కాడు. కాగా ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో ఈ కేరళ బౌలర్ సభ్యుడన్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా తొట్టతొలి పొట్టి క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ పట్టి భారత్‌ను విజయతీరాలకు చేర్చడంలో శ్రీశాంత్ పోషించిన పాత్రను ఎవరూ మరువలేరు. ఈ నేపథ్యంలో ధోనితో విభేదాలు అంటూ అతడు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అది నిజం.. కానీ ధోని భాయ్ స్టైలే వేరు
‘‘ధోని భాయ్‌తో నాకు విభేదాలున్న మాట వాస్తవమే. అయితే.. క్రికెట్ పరంగా గత కొన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చూస్తే.. ధోని తమకు మద్దతుగా నిలవలేదని ఒక్క ఆటగాడు కూడా చెప్పలేడు.
అయితే.. కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితుల కారణంగా కెప్టెన్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. సారథ్య బాధ్యతలు మోయడం అంత తేలికేమీ కాదు’’ అని మాజీ ఫాస్ట్‌బౌలర్ శ్రీశాంత్ స్పోర్ట్స్‌కీడాతో పేర్కొన్నాడు.
ధోని ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు
అదే విధంగా.. ‘‘నేను మాట్లాడే మాటలు వివాదానికి దారితీయొచ్చు.. చాలా మంది.. ‘‘అదేంటి ఒకరిద్దరు గురించే ఎక్కువగా మాట్లాడతారు? జట్టుమొత్తం కలిస్తేనే కదా విజయాలు సాధించేది’’ అని అంటూ ఉంటారు. కానీ ధోని ఎప్పుడూ తాను లైమ్‌లైట్‌లోకి రావాలని కోరుకోలేదు.
జట్టునే ముందుంచే వాడు. అంతేకాదు జట్టులో కొత్త సభ్యుల చేతికి ట్రోఫీని ఇచ్చే సంప్రదాయాన్ని కూడా తనే మొదలుపెట్టాడు. జట్టు బాగుంటే చాలని భావిస్తాడు ధోని. మేము రెండుసార్లు వరల్డ్‌కప్ గెలవడంలో ప్రతి ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. ఇది కాదనలేని సత్యం.
గంభీర్‌కు స్ట్రాంగ్ కౌంటర్?
అయితే.. పడవలో ఎంత మంది సెలబ్రిటీలు ఉన్నా.. దానిని గమ్యస్థానానికి చేర్చడంలో కెప్టెన్‌దే ప్రధాన పాత్ర కదా! ఫ్లైట్‌లో ఆటోపైలట్ ఆప్షన్ ఉన్నంత మాత్రాన పైలట్ అవసరం లేకుండా పోదు కదా!’’అని ధోనికి క్రెడిట్ ఇచ్చాడు శ్రీశాంత్.
కాగా ఇటీవలి కాలంలో 2007, 2011 వరల్డ్‌కప్ విన్నర్ గౌతం గంభీర్.. తామంతా కష్టపడినా ధోనికి మాత్రమే ఎక్కువ హైప్ వచ్చిందంటూ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చదవండి: WC: అలాంటి వాళ్లకు నో ఛాన్స్! అందుకే అతడిని ఎంపిక చేయలేదు: చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment