టీమిండియా చరిత్రకు నేటికి 16 ఏళ్లు.. పాకిస్తాన్‌పై అద్భుతం | On this day in 2007: Reliving the magical journey of Indias | Sakshi
Sakshi News home page

#2007 World cup: సాహో టీమిండియా.. నేటికి 16 ఏళ్లు.. పాకిస్తాన్‌పై అద్భుతం

Published Sun, Sep 24 2023 1:26 PM | Last Updated on Sun, Sep 24 2023 2:49 PM

On this day in 2007: Reliving the magical journey of Indias - Sakshi

2007 సెప్టెంబర్‌ 24.. భారత క్రికెట్‌ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. సరిగ్గా ఇదే రోజున  మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో భారత జట్టు.. ప్రపంచక్రికెట్‌ చరిత్రలో తమ పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ముద్దాడి అద్బుతం సృష్టించింది. 

దాయాది పాకిస్తాన్‌తో ఆఖరి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించిన ధోని సేన.. విశ్వవేదికపై భారత పతాకాన్ని రెపాలపడించింది. సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి సీనియర్‌ ఆటగాళ్ల లేకుండానే అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచింది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ వంటి మేటి జట్లను భారత్‌ మట్టికరిపించింది. భారత సాధించిన ఈ చారిత్రత్మక విజయానికి నేటికి నేటితో 16ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పొట్టి కప్ గెలిచిన మన భారత క్రికెట్ హీరోల గురించి ప్రత్యేక కథనం మీకోసం. 

భారత కెప్టెన్‌గా ధోని..
2007 సెప్టెంబర్‌ 11న ఆతిథ్య దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య మ్యాచ్‌తో తొలి టీ20 ప్రపంచకప్‌కు తేరలేచింది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు అదే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో వెస్టిండీస్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఘోర ప్రదర్శన కనబరిచింది.

బంగ్లాదేశ్‌ వంటి పసికూన చేతిలో ఓటమి పాలై గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సచిన్, గంగూలీ, ద్రవిడ్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అప్పటికే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా సత్తాచాటుతున్న మహేంద్ర సింగ్‌ ధోనికి భారత జట్టు పగ్గాలు అప్పగించారు. జట్టులో గంభీర్, సెహ్వాగ్, యువరాజ్, జహీర్‌ ఖాన్‌, హర్భజన్‌ వంటి సీనియర్‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఆరంభ మ్యాచ్‌లోనే దయాదితో పోరు..
ఈ టోర్నీలో షెడ్యూల్‌ ప్రకారం భారత తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా స్కాట్లాండ్ తో మ్యాచ్ రద్దవటంతో.. టీమిండియా ఆరంభ మ్యాచే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 141 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది.

భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప అర్ధ సెంచరీతో  రాణించగా.. కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని 33 పరుగులతో పర్వాలేదనపించాడు. పాకిస్తాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆసీఫ్‌ నాలుగు వికెట్లతో భారత్‌ను దెబ్బకొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ కూడా సరిగ్గా 141 పరుగులే చేసింది. మ్యాచ్‌ టై కావడంతో విజేతను నిర్ణయించేందుకు బాలౌట్ విధానాన్ని అంపైర్‌లు ఎంచుకున్నారు.  బాలౌట్ లో భారత్ మూడు బంతుల్లో 3 వికెట్లు పడగొట్టగా.. పాక్ బౌలర్లు ఒక్కరు కూడా వికెట్ తీయలేకపోయారు. దీంతో భారత్‌ విజేతగా నిలిచింది. 

న్యూజిలాండ్‌పై ఓటమి..
టీమిండియా తమ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 10 పరుగుల తేడాతో అనుహ్యంగా ఓటమి పాలైంది.190 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు గంభీర్‌(51),సెహ్వాగ్(40) అద్బుతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ.. మిడిలార్డ్‌ విఫలమం కావడంతో భారత్‌ ఓటమి చవిచూసింది.

యువీ స్పెషల్‌.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు
న్యూజిలాండ్‌తో ఓటమి పాలైన భారత్‌ సూపర్‌-8 స్టేజిలో ఇంగ్లండ్‌తో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ యువరాజ్‌ సింగ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ వరుసగా ఆరు బంతుల్లో 6 సిక్స్‌లు బాది చరిత్రపుటలకెక్కాడు.  ఆండ్రూ ఫ్లింటాఫ్ కవ్వించటంతో రెచ్చిపోయిన యువీ.. బ్రాడ్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు.

కేవలం 12 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ బంతుల్లో అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా యువీ రికార్డులకెక్కాడు. ఇప్పటికీ ఈ రికార్డు యువీ పేరటే ఉంది. యువరాజ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 218 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

దక్షిణాఫ్రికా చిత్తు..
ఆ తర్వాత సూపర్‌ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్‌.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికాపై 32 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.

సెమీఫైనల్లో భారత్‌-ఆసీస్‌
లీగ్‌ స్టేజ్‌ను అధిగమించిన భారత్‌.. సెమీఫైనల్లో మాత్రం పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది. సెమీఫైనల్‌తో టీమిండియా కథముగుస్తుందని అంతా భావించారు. కానీ సెమీస్‌లో భారత్‌ అద్భుతం చేసింది. ఆస్ట్రేలియాను 15 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. భారత జట్టు ఫైనల్‌ చేరడంలో​ యువరాజ్‌ సింగ్‌ కీలక పాత్ర పోషించాడు. ఆసీస్‌పై కేవలం 30 బంతుల్లో 70 పరుగులు చేసి తన జట్టుకు 188 పరుగుల భారీ స్కోర్‌ను అందించాడు.

ఫైనల్లో చిరకాల ప్రత్యర్ధిల పోరు..
ఇక తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయంతో పాకిస్తాన్‌ కూడా ఫైనల్‌కు చేరింది. దీంతో తుది పోరులో దయాదులు తాడోపేడో తెల్చుకోవాడని సిద్దమయ్యారు. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను ఇరు దేశాల అభిమానుల మాత్రమే కాకుండా యావత్తు క్రికెట్‌ ప్రపంచం వీక్షించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ దూరం కావడంతో గంభీర్‌ జోడిగా యూసఫ్‌ పఠాన్‌ బరిలోకి దిగాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన పఠాన్‌ నిరాశపరిచాడు. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. వెంటవెంటనే ఉతప్ప(8), యువరాజ్‌(14), ధోని(6) తక్కువే స్కోర్లకే పరిమితమయ్యారు.

గంభీర్‌ వీరోచిత పోరాటం..
ఒకవైపు వరసక్రమంలో వికెట్లు పడతున్నప్పటికీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మాత్రం అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. వీలుచిక్కినప్పుడు బౌండరీలు కొడుతూ.. ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓవరాల్‌గా 54 బంతులు ఎదుర్కొన్న గంభీర్‌ 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. గంభీర్‌తో పాటు రోహిత్‌ శర్మ(30) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరి అద్బుత ఇన్నింగ్స్‌ల ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

మలుపు తిప్పిన శ్రీశాంత్‌
ఇక 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ భారత బౌలర్ల ధాటికి కేవలం 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో భారత్‌ సులభంగా టైటిల్‌ను అందుకుంటుందని అంతా భావించారు. కానీ అప్పటికీ క్రీజులో ఉన్న మిస్బా-ఉల్-హక్ మాత్రం భారత్‌కు కొరకరాని కోయ్యగా మారాడు. అప్పటివరకు నెమ్మదిగా ఆడిన మిస్బా..14 ఓవర్ల తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు.

పాకిస్తాన్‌ విజయానికి చివరి ఆరు బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ బౌలింగ్‌ వస్తాడని అంతా భావించారు. కానీ భారత కెప్టెన్‌ ధోని మాత్రం అనుహ్యంగా పేసర్‌ జోగిందర్‌ శర్మ చేతికి బంతి ఇచ్చాడు. తొలి రెండు బంతుల్లో 7 పరుగులు వచ్చేసాయి. పాకిస్తాన్‌ విజయానికి 4 బంతుల్లో కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి.

దీంతో భారత ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ ఇక్కడే ధోని తన మాస్టర్‌ మైండ్‌ను ఉపయెగించాడు. జోగిందర్ శర్మ వేసిన మూడో బంతిని మిస్బా స్కూప్ షాట్ ఆడాడు. అంతే గాల్లో లేచిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ లో శ్రీశాంత్ ఒడిసి పట్టాడు.  షార్ట్ ఫైన్ లెగ్ లో ధోని ఫీల్డర్‌ను పెట్టి ఉంటాడని ఎవరూ ఊహించలేదు.  ఈ వికెట్‌తో పాక్‌ 152 పరుగులకు ఆలౌటైంది. దీంతో పొట్టి ప్రపంచకప్‌ భారత సొంతమైంది.
చదవండి: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్‌ ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement