మనం అనుకున్న కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నామని భావిస్తున్న తరుణంలో.. ఒక్కోసారి అనూహ్య రీతిలో జీవితం మలుపు తిరుగుతుంది. నీ మజిలీ ఇది కాదు.. ఇంకేదో ఉందనే సంకేతాలు ఇస్తుంది. అందుకు తగ్గట్లుగానే మనం కూడా మారాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్-2007 టీమిండియా ‘హీరో’ జోగీందర్ శర్మ జీవితంలో ఇలాగే జరిగింది.
మొట్టమొదటి విజేతగా భారత్
2007లో పొట్టి ఫార్మాట్‌లో ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్ టోర్నీలో ధోని సేన ఫైనల్‌కు చేరుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తుదిపోరులో తలపడింది. సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్న ది వాండరర్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో దాయాదిని మట్టికరిపించింది.
ఆఖరి నిమిషం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ధోని సేన 5 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి తొట్టతొలి టీ20 ప్రపకంచప్ విజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా ఈ మేరకు సరికొత్త చరిత్ర సృష్టించి రికార్డుల్లోకెక్కింది.
ధోని నమ్మకం నిలబెట్టాడు
ఇక ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అనుభవం లేని జోగీందర్ శర్మకు ఆఖరి ఓవర్లో ధోని బంతినివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, అతడు ఏమాత్రం తడబడలేదు. పాక్ గెలవాలంటే నాలుగు బంతుల్లో 6 పరుగులు అవసరమైన వేళ తెలివిగా బౌలింగ్ చేశాడు.
అతడి బౌలింగ్‌లో పాక్ క్రికెటర్ మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ ఆడగా.. శ్రీశాంత్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ క్రమంలో ధోని జట్టులో భాగమై విన్నింగ్ వికెట్ తీసిన జోగీందర్ శర్మకు మంచి పేరు వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతడు మొత్తంగా 3.3 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
రెండుసార్లు ఐపీఎల్ విన్నర్
ఇక ఆ మరుసటి ఏడాది.. ఐపీఎల్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు జోగీందర్. 2008- 2012 వరకు అదే ఫ్రాంఛైజీతో కొనసాగాడు. 2010, 2011లో సీఎస్‌కే ట్రోఫీ గెలిచిన సందర్భాల్లో భాగమయ్యాడు.
పోలీస్ ఉన్నతాధికారిగా
1983, అక్టోబరు 23న హర్యానాలో జన్మించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ జోగీందర్ శర్మ ప్రస్తుతం పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. టీమిండియా టీ20 ప్రపంచకప్ హీరోగా నిలిచిన జోగీందర్‌ను హర్యానా ప్రభుత్వం ఈ మేరకు సముచిత గౌరవంతో సత్కరించింది.
ప్రస్తుతం ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఉన్నట్లు సమాచారం. కాగా కోవిడ్ విజృంభణ సమయంలో జోగీందర్ ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా హిసార్‌లో సేవలు అందించారు కూడా! కాగా జోగీందర్ 2007లో ఆడిన ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ మ్యాచే జోగీందర్ ఆడిన చివరి అంతర్జాతీయ టీ20 కూడా!!
ఎన్ని మ్యాచ్‌లు అంటే
ఇక టీమిండియా తరఫున మొత్తంగా 4 వన్డేలు, 4 టీ20లు ఆడిన జోగీందర్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 289 వికెట్లు తీయడంతో పాటు 2689 పరుగులు చేశారు. అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో ఒకటి, టీ20లలో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నారు. రైట్‌ఆర్మ్ పేసర్ అయిన జోగీందర్ 2007లో చివరి అంతర్జాతీయ మ్యాచ్.. 2011లో ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడారు.
చదవండి: ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్ విజేత, 2 సార్లు ఐపీఎల్ ‘విన్నర్’.. ఇప్పుడు పోలీస్
Comments
Please login to add a commentAdd a comment