ఫైల్ ఫొటో
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా వేదిక విషయంలో ఇంత వరకు స్పష్టత రాలేదు. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. తమ జట్టును అక్కడికి పంపేది లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కరాఖండిగా చెప్పేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.
సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే ఆలోచన!
ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి చెప్పిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానాన్ని సూచించింది. అయితే, ఇందుకు పీసీబీ ససేమిరా అంటున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ నుంచి మొత్తంగా వేదికను తరలించి.. సౌతాఫ్రికాలో టోర్నీని నిర్వహించాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ జట్టుకు గ్రీన్ సిగ్నల్
ఈ పరిణామాల నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టు ఒకటి పాకిస్తాన్‌లో పర్యటించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చిందనే వార్త ఆసక్తికరంగా మారింది. నవంబరు 23- డిసెంబరు 3 వరకు పాక్ వేదికగా అంధుల టీ20 మెన్స్ వరల్డ్‌కప్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు క్రీడా శాఖ భారత జట్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నిరభ్యంతర పత్రాన్ని(NOC) జారీ చేసినట్లు స్పోర్ట్స్ తక్ కథనం వెల్లడించింది.
క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(CABI) ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు పేర్కొంది. అయితే, క్రీడా శాఖ నుంచి భారత జట్టుకు అనుమతి లభించినా.. తదుపరి హోం మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంది.
తొలిసారిగా పాక్ ఆతిథ్యం
ఈ విషయం గురించి CABI జనరల్ సెక్రటరీ శైలేందర్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘పదిహేను రోజులుగా క్లియరెన్స్ కోసం మేము ఎదురుచూస్తున్నాము. ప్రభుత్వం అంతిమంగా ఏది చెప్తే అదే చేస్తాం. 2014లో చివరిసారిగా మేము పాకిస్తాన్ పర్యటనకు వెళ్లాము. అక్కడ ద్వైపాక్షిక సిరీస్ ఆడాము.
అయితే, 2018 నుంచి ప్రభుత్వం మాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తోంది. అదే విధంగా.. 2023లో భారత్‌లో టోర్నీ జరిగినపుడు పాక్ జట్టు పాల్గొనలేదు’’ అని పేర్కొన్నారు. కాగా అంధుల క్రికెట్ టీ20 ప్రపంచకప్ టోర్నీకి తొలిసారిగా పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నేపాల్, అఫ్గనిస్తాన్ దేశాల జట్లు ఇందుకు అర్హత సాధించాయి. పాకిస్తాన్‌లోని లాహోర్, ముల్తాన్ వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనాలంటే భారత జట్టుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాగా ఇప్పటి వరకు మూడుసార్లు(2012, 2017, 2022) జరిగిన ఈ టోర్నీలో భారత్ మూడుసార్లూ టైటిల్ గెలిచింది.
చదవండి: టీమిండియాకు గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment