ధోనీ తప్పుకొన్నా.. సాక్షి కొనసాగుతోంది!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ శుక్రవారం రియల్ ఎస్టేట్ సంస్థ అమ్రపాలికి గుడ్‌బై చెప్పాడు. ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పదవికి రాజీనామా చేశాడు. అయితే, ధోనీ భార్య సాక్షి మాత్రం ఇప్పటికీ ఆ కంపెనీతో అనుబంధం కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. అమ్రాపాలి మహి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్‌లో సాక్షి డైరెక్టర్‌గా కొనసాగుతున్నట్టు ఆంగ్ల మీడియా ఒకటి వెల్లడించింది.
నోయిడాలోని అమ్రాపాలి రియల్టీ ప్రాజెక్టులో పెండింగ్ పనులు ఎంతకూ పూర్తికాకపోవడంతో విసుగుచెందిన ఆ కాలనీ వాసులు ట్విట్టర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. తమ సమస్యలు విన్నవించుకుంటూ.. ధోనీ ఇకనైన ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం మానుకోవాలని వారు సూచించారు. ఈ అంశం ట్విట్టర్‌లో హల్‌చల్ చేసిన నేపథ్యంలో ధోనీ రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, జార్ఖండ్‌లో పలు స్వచ్ఛంద సేవా పనులు నిర్వహిస్తున్నట్టు చెప్తున్న అమ్రాపాలితో సాక్షి అనుబంధం కొనసాగుతున్నట్టు సమాచారం.
పెండింగ్ పనుల వివాదం నేపథ్యంలో ధోనీతో కలిసి తాము ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయన బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి వైదొలిగారని అమ్రాపాలి కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వివాదంలో ధోనీని లాగడం దురదృష్టకమరని, అందుకే ఆయనను దూరంగా ఉండాల్సిందిగా తాము కోరామని పేర్కొంది.
నోయిడా సెక్టర్ 45లోని అమ్రాపాలి 'షప్పైర్' ప్రాజెక్టులో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. అయితే, తొలిదఫా ప్రాజెక్టులో ఇప్పటికీ విద్యుత్ సదుపాయం కల్పించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కాలనీ వాసులు చెప్తున్నారు. ఈ వివాదంపై గతంలో స్పందించిన ధోనీ బిల్డర్‌తో మాట్లాడి.. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే.