
ధోని జట్టు నాకౌట్‌కు
కళ్యాణి (పశ్చిమ బెంగాల్): మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో తొలిసారి జార్ఖండ్ జట్టు విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ పోరుకు అర్హత సంపాదించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన కశ్మీర్ జట్టు 43 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఒవైస్ షా (59), కెప్టెన్ పర్వేజ్ రసూల్ (45) రాణించారు. జార్ఖండ్ బౌలర్లలో నదీమ్ 5, కౌషల్ సింగ్ 2 వికెట్లు తీశారు.
తర్వాత 185 పరుగుల లక్ష్యాన్ని జార్ఖండ్ 35 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కుమార్ దేవబ్రత్ (94 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, కెప్టెన్ ధోని 19 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్... సర్వీసెస్ చేతిలో ఓడిపోవడం జార్ఖండ్‌కు కలిసొచ్చింది. గ్రూప్ ‘డి’లో హైదరాబాద్, జార్ఖండ్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... మెరుగైన రన్‌రేట్‌తో జార్ఖండ్ ముందంజ వేసింది.