
గ్రాస్ ఐలెట్: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌పై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో పాటు చండిమాల్ మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత పడింది. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో చండిమాల్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటంతో అతనిపై టెస్టు మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో అతను వెస్టిండీస్‌తో మూడో టెస్టుకు దూరం కానున్నాడు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి చండిమాల్ అప్పీలు చేశాడు. బంతి ఆకారాన్ని మార్చేందుకు తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ తనపై వచ్చిన ఆరోపణలను పరిశీలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేశాడు.
చండిమాల్ మైదానంలో ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసినట్లు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘అతను నోటిలో ఏదో పదార్థాన్ని వేసుకొని నమిలి దాని ద్వారా ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్లు.. ఇదంతా వీడియో ఫూటేజీలో పరిశీలించిన తర్వాతే అతనిపై చర్యలు తీసుకున్నట్లు’ రిఫరీ తెలిపారు. ఐసీసీ నిబంధనల ప్రకారమే అతనిపై అభియోగాలు మోపి నిర్ధారించుకున్న తర్వాతే ఒక టెస్టు సస్పెన్షన్ విధించినట్లు వివరించారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ కూడా మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్నే సమర్థించారు. రిఫరీ అన్ని పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో చండిమాల్ ఐసీసీకి అప్పీలు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండొకపోవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment