
న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో చోటు కోల్పోయిన కరుణ్ నాయర్ జాతీయ జట్టులో పునరాగమనంపై దీటుగా స్పందించాడు. ‘జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది. దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. ఇక్కడ నన్ను పక‍్కకు పెట్టడానికి సెలక్టర్లు, మిగతా వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి. ఓ క్రికెటర్‌గా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. రానున్న రోజుల్లో బ్యాట్‌తోనే సమాధానం చెబుతా’అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.
త్వరలో టీమిండియా జట్టులో చోటు దక్కుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు కరుణ్ నాయర్. మరొకసారి భారీ స్కోరు సాధించి తన సత్తా చూపించాలనుకుంటున్నానని తెలిపాడు. ఇందుకోసం చాలా ఆతృతగా ఉన్నానని, భారత్ తరపున ట్రిపుల్ సెంచరీలు చేసిన ఇద్దరు ఆటగాళ్లలో తాను ఒకడిని కావడం గర్వంగా ఉందన‍్నాడు. ఇక్కడ తాను నిరూపించుకోవాల్సింది ఏమీ లేదనే అభిప్రాయాన్ని నాయర్ వ్యక్తం చేశాడు. తాను మాట్లాడటానికి ఏమీ లేదన్న నాయర్.. ఇందుకు తన బ్యాటే సమాధానం చెబుతుందన్నాడు.
అదే సమయంలో ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ బసుతో అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ సార్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ బంగర్‌తో చాలా సమయం గడిపేవాడిని. నెట్ ప్రాక్టీస్‌లో త్రోడౌన్స్ ఆడేవాన్ని. కానీ ఎక్కువలో ఎక్కువగా బసుతో ఉండేవాడిని. ప్రస్తుత భారత జట్టులో నువ్వో అత్యుత్తమ ఫిట్‌నెస్ కల్గిన ఆటగాడివని సర్ అంటుండేవాడు. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను. భవిష్యత్తులో ఇంతే ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను' అని కరుణ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment