లండన్: తమ క్రికెట్ జట్టు హ్యాట్రిక్ ఓటములతో ఇంగ్లండ్‌కు వన్డే సిరీస్‌ను కోల్పోవడంపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బౌలింగ్‌లో పస లేకపోవడంతోనే వరుసగా పరాజయల్నిచవిచూడాల్సి వచ్చిందన్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ మూడొందలకు పైగా స్కోర్లు చేసిన విషయాన్ని అక్తర్ ఇక్కడ ప్రస్తావించాడు. మరొకసారి మూడొందలకు పైగా స్కోరును కాపాడుకోవడంలో తమ జట్టు పూర్తిగా విఫలమైందంటూ విమర్శించాడు. ఇందుకు తమ పేలవమైన బౌలింగ్ కారణమని మండిపడ్డాడు. పాకిస్తాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరిగిన నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నాల్గో వన్డేలో పాకిస్తాన్ నిర్దేశించిన 341 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగా ఛేదించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. బాబర్ అజమ్(115) సెంచరీ సాధించడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. అయితే ఆ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ఇంగ్లండ్ 94 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత జేమ్స్ విన్సే(43) ఔటయ్యాడు. కాగా, మరో ఓపెనర్ జాసన్ రాయ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. రాయ్(114) శతకం సాధించడంతో పాటు రెండో వికెట్‌కు 107 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. ఆపై జో రూట్(36), జోస్ బట్లర్(0)లు బంతి వ్యవధిలో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 208 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను నష్టపోయింది. ఇక మొయిన్ అలీ కూడా డకౌట్‌గా నిష్క్రమించడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. కాగా, స్టోక్స్(71 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, టామ్ కరాన్(31), ఆదిల్ రషీద్(12 నాటౌట్)లు తమ వంతు పాత్ర పోషించడంతో ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment