భారత రెజ్లర్లకు నిరాశ
పారిస్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్‌లో తొలి రోజు గ్రీకో రోమన్ విభాగంలో పోటీపడిన నలుగురు భారత రెజ్లర్లు హర్‌దీప్ (98 కేజీలు), యోగేశ్ (71 కేజీలు), గుర్‌ప్రీత్ సింగ్ (75 కేజీలు), రవీందర్ ఖత్రి (85 కేజీలు) నిరాశపరిచారు. ఈ నలుగురిలో ఒక్కరు కూడా కనీసం రెండో రౌండ్‌ను దాటలేకపోయారు. రెండో రౌండ్ బౌట్‌లలో హర్‌దీప్ 2–5తో విలియస్ లారినైటిస్ (లిథువేనియా) చేతిలో... యోగేశ్ 1–3తో తకెషి ఇజుమి (జపాన్) చేతిలో... రవీందర్ ఖత్రి 0–8తో విక్టర్ లోరింజ్ (హంగేరి) చేతిలో ఓడిపోయారు.
క్వాలిఫయింగ్ బౌట్‌లో గుర్‌ప్రీత్ సింగ్ 1–5తో మిందియా సులుకిద్జె (జార్జియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. భారత రెజ్లర్లను ఓడించిన వారందరూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరగడంతో... మనోళ్లకు రెప్‌చేజ్ రౌండ్‌లలో పోటీపడి కనీసం కాంస్య పతక బౌట్‌లకు అర్హత సాధించే అవకాశం లేకుండాపోయింది. పోటీల రెండోరోజు మంగళవారం భారత రెజ్లర్లు జ్ఞానేందర్ (59 కేజీలు), రవీందర్ (66 కేజీలు), హర్‌ప్రీత్ (80 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలోకి దిగుతారు.