
టిరానా (అల్బేనియా): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ అంజలి (59 కేజీలు) రజత పతకం కైవసం చేసుకుంది. 55 కేజీల పురుషుల విభాగంలో చిరాగ్ ఫైనల్‌కు దూసుకెళ్లి మరో పతకం ఖాయం చేశాడు. 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో రామచంద్ర మోర్, మహిళల 68 కేజీల విభాగంలో మోనిక కాంస్య పతకాలు గెలుచుకున్నారు.
ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరడంతో పాటు మరో పతకం ఖాయం కాగా... అంతకు ముందు శుక్రవారం మన రెజ్లర్లు రెండు కాంస్యాలు గెలుచుకున్నారు. దీంతో ఓవరాల్‌గా భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి. మహిళల 59 కేజీల సెమీఫైనల్లో అరోరా రుసో (ఇటలీ)పై విజయం సాధించిన అంజలి... తుది పోరులో ఉక్రెయిన్ రెజ్లర్ సొలోమియా చేతిలో ఓడింది.
పురుషుల 55 కేజీల ఫైనల్లో అడిమాలిక్ కరాచోవ్ (కిర్గిస్తాన్)తో చిరాగ్ తలపడనున్నాడు. 18 ఏళ్ల చిరాగ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–0తో ఒజావా గుకుటో (జపాన్)పై గెలిచాడు. క్వార్టర్స్‌లో లుబుస్ లబాటిరోవ్‌పై సెమీఫైనల్లో అలాన్ ఒరల్‌బేక్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. అభిషేక్ (61 కేజీలు), సుజీత్ (70 కేజీలు) కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment