జొకోవిచ్ ఫైనల్కు.. ఫెదరర్ ఇంటికి
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంఫియన్ నొవాక్ జొకోవిచ్ మరోసారి టైటిల్ కు అడుగుదూరంలో నిలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో జొకోవిచ్ 6-1,6-2, 3-6, 6-3 తేడాతో మాజీ చాంపియన్ రోజర్ ఫెదరర్ పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమయ్యాడు. దీంతో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆరోసారి ఫైనల్ కు చేరుకోగా, వరుసగా ఐదోసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కు చేరుకున్న ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు ఇదే టోర్నీలో జొకోవిచ్ ఫైనల్ కు వెళ్లిన ఐదు సార్లు విజేత నిలవడం మరో విశేషం. మరోవైపు 18వ గ్రాండ్ స్లామ్ ను తన ఖాతాలో వేసుకోవాలని భావించిన రోజర్ ఆశలకు మాత్రం గండిపడింది.
ఇరువురి ఆటగాళ్ల మధ్య హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్ పోరు.. గతేడాది యూఎస్, వింబుల్డన్ లో వీరిద్దరూ తలపడిన ఫైనల్ ఆటను గుర్తు చేసింది. ఆ రెండు ఫైనల్లో ఫెదరర్ పై విజయం సాధించి టైటిల్స్ చేజిక్కించుకున్న జొకోవిచ్ మరోసారి అదే ఆటను కొనసాగించాడు. దాదాపు రెండు గంటల పైగా జరిగిన పోరులో జొకోవిచ్ తొలి రెండు సెట్లను కైవసం చేసుకుని మంచి ఊపుమీద కనిపించాడు. అయితే మూడో సెట్ లో మాత్రం ఫెదరర్ అనూహ్యంగా పుంజుకుని జొకోవిచ్ కు షాకిచ్చాడు. కాగా, కీలకమైన నాల్గో సెట్ లో జొకోవిచ్ ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఫెదరర్ ను నిలువరించి ఫైనల్ కు సన్నద్ధమయ్యాడు. జొకోవిచ్ తుదిపోరులో శుక్రవారం రెండో సెమీ ఫైనల్లో తలపడే ఆండీ ముర్రే-రాయనిచ్ ల మధ్య విజేతతో ఆడతాడు.