జొకోవిచ్ 'సిక్సర్' కొట్టాడు
మెల్బోర్న్:ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ మరోసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన జోరును కొనసాగిస్తూ ట్రోఫిని చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-1,7-5,7-6(7/3) తేడాతో వరల్డ్ నంబర్ టూ ఆటగాడు ఆండీ ముర్రే(బ్రిటన్) ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. దీంతో జొకోవిచ్ ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను సాధించగా, ఓవరాల్ గా 11 వ గ్రాండ్ స్లామ్ను తన ఖాతాలో వేసుకున్నాడు.
రెండు గంటలకు పైగా జరిగిన పోరులో జొకోవిచ్ ఆద్యంతం ఆకట్టకున్నాడు. తొలి సెట్ను అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్.. రెండో సెట్ లో ముర్రే నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, ముర్రే అనవసర తప్పిదాలకు తోడు, అతని సర్వీసలను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ సెట్ ను కూడా దక్కించుకుని పైచేయి సాధించాడు. అనంతరం మూడో సెట్ లో జొకోవిచ్ -ముర్రేల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. టై బ్రేక్ కు దారి తీసిన ఆ సెట్ లో జొకోవిచ్ 7-3 తేడాతో గెలిచి టైటిల్ ను ముద్దాడాడు. కాగా, ఐదోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించిన ముర్రే మరోసారి రన్నరప్ గా నే సరిపెట్టుకున్నాడు. అంతకుముందు ముర్రే 2010,11,13,15 సంవత్సరాల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ రౌండ్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే.
జొకొవిచ్ గెలిచిన గ్రాండ్ స్లామ్ లు..
ఆస్ట్రేలియా ఓపెన్ (2008, 2011, 2012, 2013, 2015,2016)
వింబుల్డన్ (2011, 2014, 2015)
యూఎస్ ఓపెన్(2011, 2015)
ఫ్రెంచ్ ఓపెన్ లు లేవు