ధోని సేనకు 'చివరి' పరీక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియా-టీమిండియాల వన్డే సిరీస్ కు ముందు ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు తప్పదనుకున్న సగటు క్రికెట్ అభిమానికి నిరాశే ఎదురైంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు వన్డేలను ఆసీస్ కైవసం చేసుకుని సిరీస్ ను ఏకపక్షంగా మార్చేసింది. ఆసీస్ జట్టులో పెద్దగా అనుభవం లేకపోయినా, సమష్టి కృషితో విజయాలను సాధించింది. ఇక ఈ సిరీస్ లో ఒక వన్డే మాత్రమే మిగిలి ఉండటంతో టీమిండియాకు పరీక్షగా నిలిచింది. వరుస మూడు వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్లు నమోదు చేసిన ధోని సేనకు పరాభవమే ఎదురైంది. ఈ సిరీస్ లో సెంచరీల మోత మోగించిన టీమిండియా, బౌలింగ్ లో మాత్రం బాగా వెనుకబడిపోయి ఆసీస్ ముందు తలవంచింది.
ఈ తరుణంలో టీమిండియా సిడ్నీ వేదికగా శనివారం జరిగే ఆఖరి వన్డేకు సిద్ధమైంది. ఉదయం గం.8.50 ని.లకు(భారత కాలమాన ప్రకారం) ఇరు జట్ల మధ్య ఐదో వన్డే జరుగనుంది. ఇది వన్డే సిరీస్ లో చివరిది కావడంతో ఎలాగైన గెలిచి పరువు నిలుపుకోవాలని ధోని సేన భావిస్తుండగా, మరోవైపు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి తమ అప్రతిహత విజయాల సంఖ్యను మరింత పెంచుకోవాలని ఆసీస్ యోచిస్తోంది. మంచి ఊపుమీద ఉన్న ఆసీస్ కు అడ్డుకట్ట వేసి చివరి వన్డేలో గెలిస్తే మాత్రం ధోనిసేనకు కొద్దిలో కొద్ది ఊరట లభిస్తుంది. ట్వంటీ 20 సిరీస్ కు ముందు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలంటే ధోని అండ్ గ్యాంగ్ కు గెలుపు అనివార్యం. ఈ సిరీస్ లో ఘోర ఓటమికి సంబంధించి టీమిండియా జట్టు ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఒకే ఒక్క ఛాన్స్ అన్నట్లు.. ఒకే ఒక్క విజయం అనే విధంగా మారిపోయింది ధోని సేన పరిస్థితి.
తుది జట్టులో అశ్విన్!
తొలి రెండు వన్డేల్లో మాత్రమే ఆడిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ రేపటి మ్యాచ్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. మూడు, నాలుగు వన్డేల్లో అశ్విన్ ను పక్కకు కూర్చోబెట్టి సాహసం చేసిన భారత జట్టు మరోసారి ఆ తప్పిదం చేయకపోవచ్చు. అశ్విన్ తొలి వన్డేలో మాత్రమే రెండు వికెట్లు తీసినా, కీలక సమయాల్లో అతను జట్టును ఆదుకుంటూ గెలుపులో ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ ను ఆఖరి వన్డేలో ఆడించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోపక్క అతని స్థానంలో మూడు, నాలుగు వన్డేల్లో ఆడిన ఆల్ రౌండర్ రిషి ధవన్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ రెండు మ్యాచ్ ల్లో అటు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఘోరంగా విఫలమైన రిషికి చివరి మ్యాచ్ లో ఆడే అవకాశం ఉండకపోవచ్చు.
వాతావారణం
ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్ లకు వాతావరణం అనుకూలంగానే ఉన్నా.. చివరి వన్డేకు వర్షం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యే అవకాశం ఉంది.