ధోనీ, కోహ్లీలపై దాదా షాకింగ్ కామెంట్స్!
కోల్ కతా: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతు తెలిపాడు. దాదాపు రెండొందలకు పైగా వన్డేల్లో ఐదు అంతకంటే తక్కువ పొజిషన్లలో బ్యాటింగ్ చేసిన ధోనీ, ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతన్న వన్డే సిరీస్ లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు రావడం మంచి పరిణామమే అని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ స్థానంలో బ్యాటింగ్ కు దిగితే విరాట్ కోహ్లీతో కలిసి ధోనీ మ్యాచ్ ఫినిషింగ్ ఇవ్వగలడని ధీమా వ్యక్తంచేశాడు. కోహ్లీ అద్బుతమైన ఆటగాడని కితాబిచ్చిన దాదా.. అతడిని మాత్రమే నమ్ముకుని బ్యాటింగ్ చేస్తే ఓటములు తప్పవని హెచ్చరించాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగినా.. కోహ్లీ మ్యాచ్ ఫినిషర్ గా ఉంటున్నప్పుడు, ధోనీ నాలుగో స్థానంలో వచ్చి మంచి ఫినిషర్ ఎందుకు కాలేడంటూ ప్రశ్నించాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు రావడంతో ధోనీ ఫినిషర్ గా మారడం లేదంటూ వస్తున్న విమర్శలను దాదా తిప్పికొట్టాడు. ఫినిషర్ అనగానే కేవలం 40 ఓవర్ తర్వాత మాత్రమే బ్యాటింగ్ కు దిగాలన్న అపోహలను వీడాలని గంగూలీ అన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే కోహ్లీ భారీ స్కోర్ చేయకపోవడంతో నాలుగో వన్డేలో భారత్ ఓటమిపాలైందన్నాడు. ఎందుకంటే టీమిండియా కేవలం కోహ్లీ ఇన్నింగ్స్ పైనే ఆధారపడిందని, దీని నుంచి బయటపడాలని ఆటగాళ్లకు గంగూలీ సూచించాడు.