
'రాజసం' తిరిగొస్తుందా !
నెలన్నర రోజులుగా ఎంతో ఆసక్తి.. మరెంతో ఉత్కంఠ... భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులను ఆకట్టుకున్న ప్రపంచకప్‌కు ఇక తెరపడింది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ విందు సిద్ధమవుతోంది. ఏ దేశ అభిమాని అయినా... ప్రతి రోజూ తన ఫేవరెట్ ఆటగాళ్ల ఆటను తనివితీరా చూసుకునే అరుదైన అవకాశం ఇప్పుడు మళ్లీ వచ్చింది.
ప్రపంచ క్రికెట్‌లో సంచలనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగుతున్న ఎనిమిది జట్ల బలాబలాలు, బలహీనతలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన గురించి తెలుసుకుందాం. ఒక్కో రోజు ఒక్కో జట్టు గురించి సాక్షి అందిస్తున్న కౌంట్‌డౌన్ స్టోరీలు నేటి నుంచి.
- సాక్షి క్రీడావిభాగం
లీగ్ ఆవిర్భవించిన తొలి ఏడాదే ఊహించని రీతిలో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్... కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని బరిలోకి దిగుతోంది. స్పాట్ ఫిక్సింగ్‌తో కోల్పోయిన రాజసాన్ని కనీసం ఈ సీజన్‌లోనైనా మళ్లీ తిరిగి తెచ్చుకుంటుందో లేదో చూడాలి!
పింక్ సిటీ జైపూర్ ఫ్రాంచైజీకి చెందిన రాజస్తాన్ రాయల్స్ 2008 ఐపీఎల్ అరంగేట్రం టోర్నీలో అత్యంత బలహీన జట్టుగా బరిలోకి దిగి ఎవరూ ఊహించని రీతిలో చాంపియన్‌గా నిలిచింది. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నాయకత్వంలోని అప్పటి జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి కృషితో టైటిల్‌ను సాధించడంతో ఒక్కసారిగా అభిమానుల హాట్‌ఫేవరెట్ జట్టుగా మారింది. 2009లో డిఫెండింగ్ చాంపియన్ హోదాతో వచ్చిన టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
పాక్ పేసర్ సోహైల్ తన్వీర్‌తో పాటు ఆల్‌రౌండర్ వాట్సన్ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జట్టు ప్రదర్శనను దెబ్బతీసింది. కీలక మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోవడంతో ఇక 2010 నుంచి 2012 వరకూ గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. 2013లో జట్టు ప్రదర్శన కాస్త మెరుగుపడటంతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది.
తొలి ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచినా.. రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దీంతో తొలిసారి చాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని సాధించి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇదే ఏడాది అందర్ని నిశ్చేష్టులను చేస్తూ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. దీంతో జట్టు ప్రతిష్టతో పాటు అప్పటి కెప్టెన్ ద్రవిడ్‌కు కూడా ఇది మచ్చగా మిగిలిపోయింది.
మెంటార్‌గా ద్రవిడ్
ఓవైపు స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చు... మరోవైపు లీగ్‌లో జట్టు ఉంటుందో లేదోనన్న సందిగ్దం. ఇలాంటి విషమ పరిస్థితిలో గతేడాది ఐపీఎల్‌లో ఆడిన రాజస్తాన్ మళ్లీ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో పాటు జట్టు సహ యజమాని రాజ్ కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణలు రావడం.. టీమ్ ఆత్మ విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ద్రవిడ్ నాయకత్వం నుంచి తప్పుకుని జట్టు మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
గతేడాది సంజూ శామ్సన్, రహానే, వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, ఫాల్క్‌నర్‌ను రిటేన్ చేసుకోగా, అంకిత్ శర్మ, అమిత్ మిశ్రా, అంకుష్ బెయిన్స్, రజత్ బాటియా, ఉన్ముక్త్ చంద్, కెవిన్ కూపర్, బెన్ కట్టింగ్, బ్రాడ్ హాగ్, దీపక్ హుడా, ఇక్బాల్ అబ్దుల్లా, ధావల్ కులకర్ణీ, విక్రమ్‌జిత్ మాలిక్, కరణ్ నాయర్, అభిషేక్ నాయర్, కెన్ రిచర్డ్‌సన్, స్మిత్, సౌతీ, ప్రవీణ్ తాంబే, రాహుల్ టెవాటియా, దిశాంత్ యాగ్నిక్‌లు జట్టులోకి వచ్చారు.
ఈసారి ఖర్చే లేదు..
ఈసారి జరిగిన వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లపై దృష్టిపెట్టకపోవడంతో పెద్దగా ఖర్చు చేయలేదు. స్థానిక ఆటగాళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపింది. దేశవాళీల్లో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను తీసుకుంది. ఈసారి కొత్తగా బ్రెండర్ స్రాన్, దినేశ్ సాలంకే, ప్రదీప్ సాహు, సాగర్ త్రివేదిలతో పాటు విదేశీ ప్లేయర్లుగా క్రిస్ మోరిస్, కేన్ రిచర్డ్‌సన్, రుస్టీ థెరాన్‌లను జట్టులోకి తీసుకుంది. ఇక్బాల్ అబ్దుల్లా, బ్రాడ్ హాగ్, ఉన్ముక్త్ చంద్, అమిత్ మిశ్రాలను జట్టు నుంచి తప్పించింది.
కీలక ఆటగాళ్లు
2015 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ ఆటగాళ్లు స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌తో పాటు షేన్ వాట్సన్, అజింక్య రహానే, ధావల్ కులకర్ణి, అభిషేక్ నాయర్‌లు కీలక ఆటగాళ్లు. 43 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేపై అందరి దృష్టి నెలకొని ఉంది. గతేడాది గ్రూప్ దశలోనే వెనుదిరిగిన రాజస్తాన్ రాయల్స్ ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి.
ఓనర్: రంజిత్ బర్తాకూర్, మనోజ్ బదాలే
కెప్టెన్: వాట్సన్
చీఫ్ మెంటార్: ద్రవిడ్
కోచ్: ప్యాడీ ఆప్టన్
గతంలో ఉత్తమ ప్రదర్శన: 2008 చాంపియన్. 2013 ప్లే ఆఫ్