ఇలాగేనా ఆడేది?
న్యూఢిల్లీ: భారత ఆటగాళ్ల ఆటతీరుపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విరుచుకుపడ్డారు. ఆట పట్ల వారికి ఏమాత్రం అంకితభావం ఉన్నట్టు కనిపించడం లేదన్నారు.
ఆసియాకప్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు పరాజయాలతో దాదాపు టోర్నీ నుంచి నిష్ర్కమించే పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ‘ఆటపై భారత ఆటగాళ్లకున్న చిత్తశుద్ధి దారుణంగా ఉంది. అదే జట్టుకు పరాజయాలను అందిస్తోంది. అసలు ఏమాత్రం ప్రాక్టీస్ చేయడం లేదు. ఇక వీరికి ఆప్షనల్ ప్రాక్టీస్ కూడా ఉంటోంది.
ఇది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. దాన్ని కిటికీ నుంచి బయటికి విసిరేయాలి. ఈ పద్ధతి ఇక్కడే కాకుండా వారు ఆడే మిగతా టోర్నీల్లో కూడా ఉంటోంది. హోటల్ గదుల్లో ఉండడానికో, షాపింగ్ చేయడానికో వారు రాలేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండడం శోచనీయం. అందుకే చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టు వరుసగా ఓడిపోతూనే ఉంది’ అని గవాస్కర్ ధ్వజమెత్తారు. మేజర్ టోర్నీలో తొలిసారిగా కోహ్లి జట్టు బాధ్యతలు బాగానే నిర్వర్తిస్తున్నాడని అన్నారు.