ఆ మార్కు అవసరం లేదు: మిస్బా
కరాచీ: గత కొంతకాలంగా తన వీడ్కోలుపై వస్తున్న ఊహాగానాలకు పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ ఫుల్ స్టాప్ పెట్టాడు. తన రిటైర్మెంట్పై ఎవ్వరూ తొందరపడాల్సిన అవసరం లేదంటూనే, ఆ నిర్ణయం తన చేతుల్లో ఉందనే విషయం ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నాడు. దాంతోపాటు వీడ్కోలు నిర్ణయాన్ని ముందుగా ప్రకటించి ఏదో సత్కారం పొందాలనేది తన అభిమతం కాదన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో వీడ్కోలుపై ఎటువంటి ఆలోచన లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
'ఇక్కడ వయసులో పనిలేదు. మన ఫిట్నెస్పైనే జట్టులో ఉండటం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకూ నా జట్టుకు ఉపయోగపడటమే నా పని. ఆ రకంగానే ఆలోచిస్తున్నా. ఒక సీనియర్గా యువకులకు ఏ తరహాలో ఉపయోగపడాలి అనేదే నా ఆలోచన. అంతేగానీ ఇది నా చివరి మ్యాచ్ అని ముందుగా ప్రకటించి సన్మానాలు అందుకోవడం వంటి ప్రణాళికలు ఏమీ లేవు. నా రిటైర్మెంట్ అనేది నా చేతుల్లోనే ఉంది. మా క్రికెట్ బోర్డుకు ఇక్కడ సంబంధం ఉండదు. ఇది నా చివరి మ్యాచ్ అనే మార్కు నాకు అవసరం లేదు' అని మిస్బా తెలిపాడు.
ఈ ఏడాది ఏప్రిల్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్కు ముందు మిస్బా తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి. అయితే పీసీబీ చైర్మన్ షహర్యాన్ ఖాన్ విన్నపం మేరకు మిస్బా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఆ క్రమంలోనే ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్తో సిరీస్ల్లో మిస్బా కొనసాగుతూ వచ్చాడు. కాగా, తాజాగా తన వీడ్కోలు నిర్ణయంపై ముందస్తు ప్రకటన అవసరం లేదని స్పష్టం చేయడంతో అతను మరికొంత కాలం కొనసాగాలనే ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు.