
ఐపీఎల్ ను చూడటం లేదు..
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ మ్యాచ్లను కనీసం టీవీల్లో కూడా వీక్షించడం లేదని అంటున్నాడు భారత క్రికెటర్ చటేశ్వర పుజారా. ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతున్న కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నానని పేర్కొన్నాడు.' నా రోజు వారీ షెడ్యూల్ ఫిట్నెస్ ట్రైయినింగ్ తో ఆరంభమవుతుంది. అలా అని 24 గంటలు క్రికెట్ కే కేటాయించను. అటు కుటుంబం, ఇటు ఫ్రెండ్స్ కి సమాన సమయం కేటాయిస్తుంటాను. ఆ కారణం చేతనే ఐపీఎల్ మ్యాచ్లను టీవీల్లో వీక్షించడం లేదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతున్నా'అని పుజరా పేర్కొన్నాడు.
ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో చటేశ్వర పుజారను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. అతనిపై టెస్టు ఆటగాడనే ముద్ర ఉండటంతో పుజారాను తీసుకునేందుకు ఎవరూ మొగ్గు చూపలేదు. ఆ వేలానికి వారానికి ముందు తన ఆటను ట్వంటీ 20లకు సరిపడా మార్చుకున్నానంటూ పుజారా స్సష్టం చేసినప్పటికీ అతనికి నిరాశే ఎదురైంది. ఆ క్రమంలోనే ఐపీఎల్ మ్యాచ్లను పుజారా వీక్షించకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.