డబుల్స్‌లో కోచ్‌లకు స్వేచ్ఛ లేదు! | Sakshi
Sakshi News home page

డబుల్స్‌లో కోచ్‌లకు స్వేచ్ఛ లేదు!

Published Sun, May 25 2014 12:14 AM

డబుల్స్‌లో కోచ్‌లకు స్వేచ్ఛ లేదు!

కొత్త జోడీలను ప్రయత్నించలేకపోతున్నాం
 పుల్లెల గోపీచంద్ వ్యాఖ్య
 
 న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో భారత్ మంచి ఫలితాలు సాధించాలంటే భవిష్యత్తులో చాలా శ్రమించాల్సి ఉందని జాతీయ జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయ పడ్డారు. అందుకోసం కట్టుదిట్టమైన వ్యవస్థను రూపొందించాలని ఆయన సూచించారు. శుక్రవారం ఉబెర్ కప్ సెమీ ఫైనల్లో జపాన్ చేతిలో ఓటమి అనంతరం డబుల్స్‌కు సంబంధించి గోపీచంద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబుల్స్‌లో ఆటగాళ్లను సానబెట్టేందుకు కావాల్సిన స్వేచ్ఛ కోచ్‌లకు లభించడం లేదని ఆయన అన్నారు. ‘డబుల్స్‌లో మనం చాలా దూరంలో ఉన్నాం. ఒక జంటను తీర్చి దిద్దేందుకు చాలా సమయం పడుతుంది. ఒక ప్లేయర్‌ను డబుల్స్ కోసం ఎంపిక చేస్తే ఆమె డబుల్స్ మాత్రమే ఆడాలి. ఈ రకంగా చూస్తే వేర్వేరు భాగస్వామ్యాలను ప్రయత్నించేందుకు విదేశీ కోచ్‌లకు లభిస్తున్న స్వేచ్ఛ, అధికారం  భారత్‌లో లేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఉబెర్ కప్‌లో భారత క్రీడాకారిణుల ప్రదర్శన పట్ల గోపీచంద్ సంతృప్తి వ్యక్తం చేశారు.
 
  తొలి సారి ఇలాంటి టోర్నీ ఆడే యువ షట్లర్లపై ఎంతో ఒత్తిడి ఉందని...ఇండోనేసియా, థాయిలాండ్‌లపై గెలవడం మంచి ప్రదర్శనగా ఆయన పేర్కొన్నారు. ‘సైనా, సింధు, జ్వాల, అశ్విని చాలా బాగా ఆడారు. జపాన్‌తో డబుల్స్ మ్యాచ్ సమయంలో పరిస్థితి సమంగా ఉంది. ఆ మ్యాచ్ ఓడాక మనం ముందుకు వెళ్లలేమనిపించింది’ అని కోచ్ విశ్లేషించారు. రెండో డబుల్స్‌లో సైనా-సింధు జోడిగా ఆడాల్సి వచ్చినా, అది సరైన వ్యూహం కాదని...ఇది వారి సింగిల్స్ ఆటపై ప్రభావం చూపించే ప్రమాదం ఉందని గోపీచంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 జపాన్ ఓపెన్‌కు సైనా, సింధు దూరం...
 ఉబెర్ కప్‌లో తీవ్రంగా శ్రమించిన భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులు తర్వాతి టోర్నీ ఆడకుండా విశ్రాంతి ఇస్తున్నట్లు గోపీచంద్ ప్రకటించారు. దీంతో వచ్చే నెల 10 నుంచి 15 వరకు టోక్యోలో జరిగే జపాన్ ఓపెన్‌లో వీరిద్దరు పాల్గొనడం లేదు. ఆ తర్వాత జూన్ 17 నుంచి 22 వరకు జరిగే ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, 24-29 మధ్య జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలలో సైనా, సింధు ఆడతారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement