హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఐల్ ఆఫ్ మ్యాన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారికతోపాటు మరో ముగ్గురు నినో బత్సియాష్‌విలి (జార్జియా), అనా ఉషెనినా (ఉక్రెయిన్), తానియా సచ్‌దేవ్ (భారత్) 5.5 పాయి0ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... హారికకు టాప్ ర్యాంక్ లభించింది. నినో బత్సియాష్‌విలి రెండో స్థానంలో, అనా ఉషెనినా మూడో స్థానంలో, తానియా నాలుగో స్థానంలో నిలిచారు. ఇంగ్లండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హారిక కేవలం 15 ఎత్తుల్లో అర్మేనియా గ్రాండ్‌మాస్టర్ సెర్గీ మూవ్‌సెసియాన్‌తో ‘డ్రా’గా ముగించింది.
ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయి0ది. ఏడో రౌండ్‌లో హారిక మహిళల ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ హు ఇఫాన్ (చైనా)ను ఓడించి సంచలనం సృష్టించింది. మొత్తం 133 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ నుంచి 26 మంది బరిలోకి దిగారు. తెలుగు క్రీడాకారులు ఎం.ఆర్. లలిత్ బాబు 5.5 పాయి0ట్లతో 28వ స్థానంలో, హర్ష భరతకోటి 4 పాయి0ట్లతో 79వ స్థానంలో, కోటిపల్లి సాయి నిరుపమ 3.5 పాయి0ట్లతో 110వ స్థానంలో నిలిచారు.