డీఆర్‌ఎస్ కంటే ఆట ముఖ్యం: రహానే
రాజ్‌కోట్: ఎనిమిదేళ్ల అనంతరం భారత జట్టు అంపైర్ నిర్ణయ సమీక్ష పద్దతి (డీఆర్‌ఎస్) అమలుతో టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. అయితే దీని గురించి ఎక్కువ చర్చ అనవసరమని... డీఆర్‌ఎస్ కంటే ఆట గురించి ఆలోచించడం ముఖ్యమని భారత బ్యాట్స్‌మన్ రహానే అన్నాడు. ‘డీఆర్‌ఎస్ గురించి గత సిరీస్ నుంచే మాట్లాడుకుంటున్నాం. దీని గురించి మా దగ్గర ప్రణాళికలు ఉన్నారుు. ఇది అమలు ఉన్నప్పుడు ఏం చేయాలి..? ఎలాంటి నిర్ణయాలను సమీక్షించమని అడగాలి లాంటి అంశాలపై చర్చించుకున్నాం. అరుుతే దీని కంటే నాణ్యమైన క్రికెట్ ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి’ అని రహానే చెప్పాడు. డీఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవడంలో వికెట్ కీపర్, స్లిప్‌లో ఫీల్డర్ పాత్ర కీలకమని అన్నాడు. రివ్యూకు వెళ్లడంపై ప్రతీసారీ స్పష్టత ఉండాల్సిందేనని అన్నాడు.
మరోవైపు మూడు దశాబ్దాల అనంతరం భారత క్రికెట్ జట్టు సొంత గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడబోతోంది. దీంతో సిరీస్ ముగింపు వరకు ఆటగాళ్లు తాజాగా ఉండడంతో పాటు ఆసక్తి కోల్పోకుండా ఉండడం ముఖ్యమని రహానే అభిప్రాయపడ్డాడు. అరుుతే ఇంగ్లండ్ పర్యటన (2014)లో తాము ఐదు టెస్టుల సిరీస్ ఆడామని, ఎలా పోరాడాలో తమకు అవగాహన ఉందని చెప్పాడు. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ లైనప్ అనుభవంతో కూడుకుందని, వారి స్పిన్నర్లు కొత్తవారే అరుునా అలసత్వం తగదని సూచించాడు. ‘గత ఏడాదిన్నర కాలం నుంచి మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. నిలకడగా ఆడడం చాలా ముఖ్యం. రాజ్‌కోట్‌లో ఆధిక్యం ప్రదర్శించి సిరీస్ మొత్తం అదే ఆటను చూపాలనే ఆలోచనలో ఉన్నాం. విరాట్ కెప్టెన్సీలో ఆడడాన్ని ఆస్వాదిస్తున్నాం. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది’ అని 28 ఏళ్ల రహానే తెలిపాడు.
డీఆర్‌ఎస్ కీలకం: బ్రాడ్
ఇంగ్లండ్ జట్టుకు డీఆర్‌ఎస్ కొత్త కాకపోరుునా భారత గడ్డపై విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేసర్ స్టువర్ట్ బ్రాడ్ హెచ్చరించాడు. ‘ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్ కాస్త భిన్నంగా ఉంటుంది. మా దగ్గర బంతి సీమ్, స్వింగ్ అయ్యే విధానంతో పోలిస్తే ఇక్కడ స్పిన్ చాలా తేడాగా ఉంటుంది. అందుకే నిర్ణయం తీసుకోవడం కష్టం. ఈ సిరీస్‌లో డీఆర్‌ఎస్ పాత్ర చాలా కీలకంగా ఉండనుంది’ అని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.