‘డబుల్’ అవకాశం చేజారింది!: క్రికెటర్
కెప్ టౌన్: వన్డేల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును టెస్ట్ కెప్టెన్ డుప్లెసిస్ (185, 141 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో చేజార్చుకున్నాడు. అయితే తనకు డబుల్ సెంచరీ ఆలోచన గానీ, అత్యధిక స్కోరు రికార్డు గానీ తన మైండ్ లోకి రాలేదని, 180 పరుగులు చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాడు. మంగళవారం రాత్రి లంకపై నాలుగో వన్డేలో గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్‌స్టెన్ చేసిన 188నాటౌటే ఆ జట్టు తరఫున వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. 1996 ప్రపంచ కప్‌లో భాగంగా రావల్పిండిలో యూఏఈతో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు కిర్‌స్టెన్.
టెస్ట్ కెప్టెన్సీ తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని, నాలుగో వన్డే సెంచరీ హీరో డుప్లెసిస్ అన్నాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఆడిన షాట్ ఫోర్ అయింటే కిర్‌స్టెన్ రికార్డును అధిగమించేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ ఔటయ్యానని చెప్పాడు. ఏది ఏమైతేనేం జట్టు విజయం సాధించిందని, కిర్‌స్టెన్ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరులో రెండో స్థానం దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు డుప్లెసిస్. 20 ఏళ్లు ముగిసినా సఫారీ మాజీ ఆటగాడు కిర్‌స్టెన్ రికార్డు మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. గత 10 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేసిన డుప్లెసిస్.. 71 సగటుతో 640 పరుగులు చేశాడు.