దిండిగల్: ఇండియా ‘రెడ్’తో మంగళవారం మొదలైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి ఇండియా ‘బ్లూ’ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (147 బంతుల్లో 96; 14 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (136 బంతుల్లో 53 బ్యాటింగ్, 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు 144 పరుగులు జోడించి ‘బ్లూ’ జట్టును ఆదుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ‘బ్లూ’ జట్టుకు ఓపెనర్లు ఫైజ్ ఫజల్ (32), స్మిత్ పటేల్ (22) అర్ధ శతక భాగస్వామ్యం అందించారు.
అయితే వీరిద్దరితో పాటు ధ్రువ్ షోరే (18), దీపక్ హుడా (26) వెంటవెంటనే ఔటవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో అన్‌మోల్‌ప్రీత్, రికీ భుయ్ బాధ్యతాయుత ఆటతో జట్టును ఆదుకున్నారు. శతకానికి కొద్ది దూరంలో అన్‌మోల్‌ను ప్రసిధ్ కృష్ణ (2/49) ఔట్ చేశాడు. మరో బౌలర్ పర్వేజ్ రసూల్ (2/65) రెండు వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment